* 107, 108 జిఒలను రద్దు చేయాలి
* ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హరీష్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: వైద్య విద్యను పేదలకు దూరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.హరీష్ విమర్శించారు. అందులో భాగంగానే 107, 108 జిఒలను విడుదల చేసి బహిరంగ మార్కెట్‌లో వైద్య విద్యను అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. 107, 108 జిఒలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని సూర్యమహల్ కూడలి నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు శనివారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలల్లో వైద్య సీట్లు అమ్మకానికి పెట్టిందన్నారు. మెడికల్ కాలేజీల్లో 107, 108 జిఒలను తీసుకొచ్చి వైద్య విద్యను సామాన్యులకు దూరం చేయాలని చూస్తోందన్నారు. గతేడాది రాష్ట్రంలో 68 వేల విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరైతే, 48 వేల విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. వారందరికీ వైద్య కళాశాలల్లో సీట్లు వస్తాయని ఆనందపడ్డారన్నారు. 107, 108 జిఒల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు వైద్య కళాశాలల్లో ప్రైవేటు యాజమాన్యాల తరహాలో సీట్లను కేటగిరీలుగా విభజించి 50 శాతం జనరల్ కేటగిరీగా 35 సీట్లను బి కేటగిరీగా, 15 శాతం సి కేటగిరిలో చేర్చి ధరలు నిర్ణయించారని తెలిపారు. బి-క్యాట్‌కు రూ.12 లక్షలు, సి-క్యాట్‌కు రూ.20 లక్షల ఫీజులు వసూలు చేసేందుకు నిర్ణయిస్తూ జిఒలు ఇచ్చారన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజులు పెంచడం వల్ల పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఆర్థిక స్థోమత లేక చదువుకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జిఒలు రద్దు చేయకపోతే విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు డి.చందు, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.










