Aug 13,2023 21:41

మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందని, ప్రజారోగ్యానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని 6వ వార్డు వెంకట్‌రెడ్డి నగర్‌లో రూ.1.06 కోట్లతో నిర్మించిన వైఎస్‌ఆర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో పాటు వైద్యాధికారులు, సిబ్బంది తగినంత స్థాయిలో ఉన్నారన్నారు. 63 రకాల రక్త, ఆరోగ్య పరీక్షలను పిహెచ్‌సి స్దాయిలో తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోందని, దీనిలో భాగంగా ఆరోగ్య కేంద్రాలకు బయోకెమిస్ట్రీ, ఎలక్ట్రోలైట్‌ ఎనలైజర్‌ లాంటి ఆధునిక పరికరాలను ఒక్కొక్కటిగా సమకూరు స్తోందని తెలిపారు. 175 రకాల మందులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథ మిక, పట్టణ ఆసుపత్రుల్లో లభించనున్నా యన్నారు. సీఆర్‌పీ, ఎస్‌జిఓటి, ఎస్‌జిపిటీ, యుఆర్‌ఈఏ, హెచ్‌బి, ప్లేట్‌ లెట్‌ కౌంట్‌, సిబిసీ, టోటల్‌ బ్లడ్‌ సెల్‌ కౌంట్‌ ర్యాండమ్‌ బ్లడ్‌ షుగర్‌, బ్లడ్‌ యూనియా, హెపటైటీస్‌, హెచ్‌ ఐవి, డెంగీ, బ్లడ్‌ క్లాటింగ్‌ టైప్‌ థైరాయిడ్‌, సీరమ్‌ ప్రోటీన్‌ తదితర ఖరీదైన పరీక్షలు కూడా ప్రజలకు లభిస్తాయన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులు, పిహెచ్‌సిల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీని రాష్ట్ర మరింత పటిష్టం చేసిందని, వైద్య రంగంలో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ రోల్‌మోడల్‌గా నిలుస్తోందని అన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, డిఆర్‌ఒ వినాయకం, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ జి.శోభారాణి, డిప్యూటీ డిఎంహెచ్‌ డాక్టర్‌ బి.గీతాంజలి, డాక్టర్‌ జి.హర్ష, డాక్టర్‌ హనుమ, దయానంద, కాంట్రాక్టర్‌ మంగపతిరెడ్డి పాల్గొన్నారు.