Oct 27,2022 23:21

రోగి బంధువులతో మాట్లాడుతున్న గిరిజన సంఘం నేత సురేంద్ర

 ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండల కేంద్రలోని సామాజిక ఆరోగ్య కేంద్రం(సిహెచ్‌సి)లో . వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ఇతర సిబ్బందిని నియమించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్‌ చేశారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న గిరిజన రోగులను పరామర్శించి, వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ముంచంగిపుట్టు 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో 6గురు వైద్యులు ఉండాల్సి ఉండగా పూర్తి స్థాయిలో లేరన్నారు. 10మంది స్టాఫ్‌ నర్సులకుగాను నలుగురితో సేవలందిస్తే ఏ విధంగా వైద్య సేవలు అందుతాచని ప్రభుత్వాన్ని సురేంద్ర ప్రశ్నించారు. గతంలో హాస్పిటల్‌ అభివృద్ధి నిధులు ఏడాదికి రూ.12 లక్షలు విడుదల చేసే వారని, ఇప్పుడు ఆరు లక్షలు వరకు నిధుల కోత విధించారన్నారు. గతంలో 450 రకాల మందులు హాస్పిటల్‌కు వచ్చేవని, ఇప్పుడు కేవలం 130 రకాల మందులు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. పూర్తిస్థాయిలో మందులు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. హాస్పిటల్‌కు ప్రతి రోజు వందల సంఖ్యల్లో వైద్య చికిత్స నిమిత్తం రోగులు వస్తుంటే ఇద్దరు డాక్టర్లతో ఏ విధంగా నడుపుతున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి ఏంఏం శ్రీను, సిఐటియు కార్యదర్శి పి భీమరాజు, లక్ష్మీపురం సర్పంచ్‌ కే.త్రినాథ్‌, వి.లైకోన్‌, కే.డోమ్రు పాల్గొన్నారు.