Feb 21,2023 23:51

మంచంపై కూర్చొబెట్టి మోసుకొస్తున్న బంధువులు, వైద్య సిబ్బంది

డోలి ద్వారా తరలింపు
ప్రజాశక్తి -సీలేరు

నవ మాసాలు నిండిన గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేసుకోవడానికి నిరాకరించగా, వైద్య సిబ్బంది చొరవ తీసుకొని ఆమె ఆసుపత్రికి తరలించి ప్రసవం చేశారు. జికె.వీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ పరిధి గాలికొండలో జరిగిన ఈ సంఘటకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి... గాలికొండ గ్రామంలోని పిటికి తెగకు చెందిన గర్భిణి గిల్లూరి దేవికి మంగళవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆశా కార్యకర్త బంగారి ఆసుపత్రిలో కాన్పు వేయించుకోవాలని కౌన్సిలింగ్‌ చేసింది. అయినప్పటికీ ఆసుపత్రి రావడానికి దేవి నిరాకరించారు. దీంతో ఆశా కార్యకర్త సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్‌ సూపర్‌ వైజర్‌ త్రినాధ్‌కి తెలియజేశారు. వెంటనే ఆయన సిబ్బందితో కలిసి గాలికొండ చేరుకొని గర్భిణి దేవిని సీలేరు ఆస్పత్రికి తీసుకురావాలని వారి బంధువులకు సూచించారు. అయినా ఆమె వినకపోవడంతో గత్యంతరం లేక స్థానిక ఎస్సై రామకృష్ణకు వైద్య సిబ్బంది సమాచారం అందించారు. దీంతో స్పందించిన ఎస్‌ఐ గర్భిణి దేవికి, వారి కుటుంబ సభ్యులకు ఫోన్లో కౌన్సిలింగ్‌ నిర్వహించారు. దీంతో దేవి కుటుంబ సభ్యులు సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పు చేయించడానికి అంగీకరించారు. అయితే ఆమెను వాహనంలో ఆసుపత్రికి తీసుకురావడానికి గాలికొండ గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి. దీంతో హెల్త్‌ సూపర్వైజర్‌ త్రినాధ్‌ సూచన మేరకు గ్రామస్తులు దేవిని మంచంపై కూర్చొబెట్టి ఆసుపత్రికి తీసుకొచ్చారు. దేవి ఆసుపత్రిలో పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో గిల్లూరు దేవి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.