Oct 26,2023 20:59

వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి-సాలూరు : పట్టణంలో గురువారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. శిబిరంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు, రిజిస్ట్రేషను, టోకెను జారీ విధానం, వైద్యులు, సిబ్బంది హాజరు, చికిత్స కోసం వచ్చిన ప్రజలు, వైద్య సేవలను ఆయన నిశితంగా పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిరుపేదలు, దూర ప్రాంతాల ప్రజలకు గొప్ప వరమని, నిపుణులైన వైద్యులు ప్రజల వద్దకే వచ్చి వైద్యసేవలు అందిస్తున్నారని వివరించారు. ప్రజలకు ఇంటివద్దే బిపి, మధుమేహం, రక్తహీనత, మూత్రం, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 30 నుండి వచ్చే నెల పదో తేదీ వరకు 287 వైద్య శిబిరాలు జిల్లాలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 84 మంది ప్రత్యేక వైద్య నిపుణులు పాల్గొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల కోసం ఉచితంగా అందించే ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జిల్లాలో ఇప్పటి వరకు సుమారు లక్షా ఏడు వేల మంది వైద్య సేవలు పొందారని ఆయన చెప్పారు. 11,094 మందికి మధుమేహం, 17,818 మందికి బిపి ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. జీవన శైలిలో మార్పుల కారణంగా ఇటువంటివి వ్యాప్తి చెందుతున్నాయని, వాటి పట్ల అవగాహన కల్పిస్తున్నారని వివరించారు. 53,531 లాబ్‌ టెస్టులు చేసినట్లు ఆయన వెల్లడించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను తనిఖీ చేశారు. శిబిరానికి వచ్చే అందరికీ ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, రక్తహీనతతో బాధపడుతున్న వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ, కమిషనర్‌ టి.జయరాం, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ శివకుమార్‌, వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు, మెడికల్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.