
ప్రజాశక్తి-బలిజిపేట : మండలంలో అజ్జాడ గ్రామాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) టి.జగన్మోహనరావు బుధవారం సందర్శించారు. పలు ఆరోగ్య కార్యక్రమాలను పరిశీలించి, సేవలపై ఆరా తీశారు. ముందుగా అక్కడ చిన్నారులకు నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వైద్య సిబ్బంది టీకా వేస్తున్న తీరును గమనించారు. వ్యాక్సిన్‌ను తనిఖీ చేశారు. టీకా కార్డుల్లో తేదీల నమోదును పరిశీలించి, నిర్ణీత గడువు తేదీలను తల్లిదండ్రులకు విధిగా తెలియజేయాలన్నారు. అక్కడ వారితో ఆయన మాట్లాడి పిల్లల ఆరోగ్య స్థితిపై అడిగి తెలుసుకున్నారు. టీకా వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం అయోడిన్ లోపం వల్ల కలిగే సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఆయన శుక్రవారం గ్రామంలో నిర్వహించే జగనన్న ఆరోగ్య సురక్షపై అక్కడ సచివాలయంలో సమీక్ష చేశారు. సర్వేలో అందజేసిన టోకెన్లు, కార్యక్రమం నిర్వహించే వేదిక, పరిధిలో ఉన్న గ్రామాలు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సిహెచ్.జగన్మోహన్, వైద్య సిబ్బంది చిన్నమ్మలు, సోనియా, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.