* శాసనసభ స్పీకర్ సీతారాం
ప్రజాశక్తి - సరుబుజ్జిలి: రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అధిక నిధులు కేటాయించి పెద్దపీట వేస్తుందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సరుబుజ్జిలి మండల కేంద్రంలో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అనుబంధంగా ఉన్న రెడ్డీస్ ఫౌండేషన్ నేతృత్వంలో అత్యాధునికంగా రూపొందించిన పిహెచ్‌సి భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజలకు వైద్యం సకాలంలో అందించగలిగినప్పుడే ప్రభుత్వ పాలనా ఫలాలు ప్రజానీకానికి దక్కినట్లు భావించాలన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు, యాంత్రికరణతో వ్యవసాయం చేయడం, విత్తనాలు, ఎరువుల పంపిణీ పంపిణీ, పాఠశాలలకు భవనాల సమకూర్చేందుకు ముందుకొస్తున్న రెడ్డీస్ ఫౌండేషన్ ఔదార్యతను ప్రశంసించారు. ప్రజలకు, ప్రభుత్వం అందించే ప్రతి సేవలోనూ, స్వచ్ఛంద సంస్థలు చేయూతనందించగలిగితే అద్భుతమైన ఫలితాలు సాధ్యపడతాయన్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ముందుకొస్తే ఆయా సంస్థలను పరిపుష్టి చేసేందుకు దోహదికారిగా నిలుస్తుందన్నారు. జిల్లాలో 11 పిహెచ్‌సి భవనాల ఆధునీకకరణ, సుందరీకరణ చేపట్టేందుకు రెడ్డిస్ ఫౌండేషన్ ముందుకు రావడం అభినందించదగ్గ విషయమన్నారు. వాటిలో సరుబుజ్జిలి పిహెచ్‌సి ఆధునికీకరణ చేపట్టడాన్ని రెడ్డీస్ యాజమాన్యానికి అభినందించారు. డాక్టర్ ఛాంబర్, ఫార్మా, ల్యాబ్, ఆరు పడకలు, ఆస్పత్రిలో పలు భవనాలను ఆధునికీరరించారు. గ్రామస్థాయిలో వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసిందన్నారు. 108, 104 సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చిందన్నారు. వివిధ యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది నియామకాలను చేపట్టిందన్నారు. ప్రతి జిల్లాలో దాదాపుగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు ప్రగతి బాటలో పయనిస్తున్నాయన్నారు. సిఎం సంకల్పానికి డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ తరహాలో, మిగిలిన కార్పొరేట్ యాజమాన్యాలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్డీస్ సిఇఒ సమీర్ ట్రేహన్, రెడ్డీస్ హెడ్ హెల్త్ న్యూట్రిషన్ ఎస్.శ్రీనివాసరావు, రెడ్డీస్ సిఇఒ ప్రవీణ్‌కుమార్ చౌదరి, రెడ్డీస్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ బి.సురేష్, డిఎం్‌హెచ్‌ఒ బొడ్డేపల్లి మీనాక్షి, ఎఒ మాస్ మీడియా ఆఫీసర్ పైడి వెంకట్ రమణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవ్యశ్రీ, డాక్టర్ సంతోష్, ఎంపిపి కె.వి.జి.సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ బెవర మల్లేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు కోవిలాపు చంద్రశేఖర్, మండల సచివాలయాల కోఆర్డినేటర్ అత్తులురి రవికాంత్, సర్పంచ్ బొడ్డేపల్లి హరి పాల్గొన్నారు.










