వైద్యఆరోగ్య శాఖ జోన్-4లో పలువురు ఫెవికాల్ వీరులు తిష్ట వేశారు. సిఫారసు లెటర్ల మాటున దశాబ్దాల తరబడి ఉన్నచోటనే పాతుకుపోయారు. ఆర్‌డి కార్యాలయం రికార్డుల నిర్వహణ చేయకపోవడంతోనే ఇటువంటి పరిస్థితి తలెత్తిందనే వాదన వినిపిస్తోంది. ఫలితంగా వందలాది మంది అర్హులైన ఉద్యోగులకు అన్యాయం చోటుచేసుకుంటోంది. పలుకుబడి కలిగిన ఉద్యోగులు ఏళ్ల తరబడి ఉన్నచోటనే పాతుకుపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శ పెద్దఎత్తున వినిపిస్తోంది. తాజాగా ఈ నెల 20, 21, 22వ తేదీల్లో ఆర్‌డి కార్యాలయ ఉన్నతాధికారులు చేపట్టిన బదిలీల్లోనైనా ఇటువంటి ఉద్యోగులను బదిలీ చేయాలని కోరుతూ పలువురు ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.ప్రజాశక్తి - కడప ప్రతినిధి
వైద్యఆరోగ్య శాఖ జోన్-4 పరిధిలో 15 విభాగాలకు సంబంధించి నాలుగు పాత ఉమ్మడి జిల్లాల్లో సుమారు ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కడప రీజినల్ డైరెక్టర్ ప్రాంతీయ కార్యాలయం ఈ నెల 20, 21, 22వ తేదీల్లో చేపట్టిన బదిలీలకు 700 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 30 శాతం నిబంధన కింద 525 మంది రెండేళ్ల రిక్వెస్ట్ బదిలీలు, ఐదేళ్లు కాలపరిమితి నిండిన ఉద్యోగుల పారామీటర్ల కింద బదిలీలకు అర్హులైనట్లు సమాచారం. ఉదాహరణకు తిరుపతి రుయా ఆస్పత్రిలో ఎనిమిది మంది సీనియర్ అసిస్టెంట్లు సుమారు 20 ఏళ్లుగా తిష్ట వేసుకుని కూర్చున్నారనే విమర్శ పెద్దఎత్తున వినిపిస్తోంది. వీరందరూ నాయకుల సిఫారసు లెటర్లు మాటున తిష్ట వేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒకే చోట ఏళ్ల తరబడి ఉండడంతో కిందిస్థాయి ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి తరహాలో పలుకుబడిన కలిగిన ఉద్యోగులు పాతుకుపోవడంతో దశాబ్దాల తరబడి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఏళ్ల తరబడి సీనియారిటీ కలిగిన ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల్లోనే మగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదేతరహాలో నకిలీ స్పౌజ్ సర్టిఫికెట్ల పేరుతో పలువురు ఉద్యోగులు సీనియారిటీ కలిగిన ఉద్యోగుల అవకాశాలకు గండి కోడుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మిగిలిన నాలుగు విభాగాల పరిధిలో వందలాది మంది ఉద్యోగులు పెవికోల్ తరహాలో పాతకుపోయి ఉన్నారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా ఆర్‌డి కార్యాలయ అధికారులు సిఫారసు లెటర్ల మాటున అర్హులైన ఉద్యోగులకు మొండిచేయి చూపించారు. సిఫారసు లెటర్లను కలిగిన ఉద్యోగుల బదిలీల విషయంలో అర్హలైన ఉండి, సీనియారిటీ కలిగిన ఉద్యోగుల ఆమోదం పొందిన అనంతరం బదిలీ అంశాన్ని పరిశీ లించాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో సందే హంలేదు. లేకపోతే దశాబ్దాల తరబడి అర్హత కలిగిన సీనియర్ ఉద్యోగుల గ్రామీణ ప్రాంతాల్లోనే మగ్గిపోవాల్సి వస్తోందనే అంశాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.










