ప్రజాశక్తి-కాకినాడ కాకినాడ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో ఇంకా మిగిలియున్న ఖాళీలను త్వరితగతిన భర్తీకి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కతికాశుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న ఖాళీల వివరాలు, ఆసుపత్రుల్లో జరుగుతున్న నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ కతికా శుక్లా డిఆర్‌ఒ కె.శ్రీధర్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కతికా శుక్లా మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు. కాకినాడ జిజిహెచ్, డిఎంహెచ్‌ఒ, డిఎంఇ, ఎపివివిపి విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల తక్షణ భర్తీకి చర్యలు తీసుకోవాలని కలెక్టరు అధికారులకు ఆదేశించారు. అన్ని ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, పారామెడికల్, టెక్నికల్ అసిస్టెంట్ సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. మెడికల్ ఆఫీసర్లు, నర్సులు, క్లినికల్ సైకాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్ తదితర ఖాళీల భర్తీకి త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ ఆసుపత్రుల్లో జరుగుతున్న నిర్మాణ పనులపై ప్రత్యేక దష్టి పెట్టి సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ కతికా శుక్లా అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్.రమేష్, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డి.హేమలతాదేవీ, ఉమ్మడి జిల్లా డిసిహెచ్‌ఎస్ డాక్టర్ సనత్ కుమారి, డిఐఒ డాక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.










