Jun 24,2023 21:04

వైద్య ఆరోగ్య శాఖలో గందర గోళం

వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ ముగిసినప్పటికీ మాడిఫికేషన్‌ పేరుతో కొనసాగుతూనే ఉంది. ఈ నెల 20, 21, 22వ తేదీల్లో డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో జోన్‌-4 పరిధిలోని వేలాది మంది ఉద్యోగులకు బదిలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆర్‌డి కార్యాలయ ఉన్నతాధికారులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇష్టానుసారంగా బదిలీలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆఫీస్‌ సూపరింటెండెంట్‌, డిప్యూటీ స్టాటికల్‌ ఆఫీసర్స్‌, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుల బదిలీలను ఇష్టానుసారంగా చేశారనే విమర్శల నేపథ్యంలో కథనం...ప్రజాశక్తి - కడప ప్రతినిధి
వైద్య ఆరోగ్య శాఖ జోన్‌-4లో సుమారు 23 విభాగాల్లో సుమారు ఎని మిది వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కడప రీజినల్‌ డైరెక్టర్‌ ప్రాంతీయ కార్యాలయంలో నాలుగు ఉమ్మడి కడప జిల్లాలకు చెందిన ఉద్యోగులకు ఇటీవల బదిలీలు చేపట్టిన సంగతి తెలిసిందే. 700 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 30 శాతం నిబంధన కింద రెండేళ్ల రిక్వెస్ట్‌, ఐదేళ్లు కాలపరిమితి కలిగిన ఉద్యోగుల పారామీటర్ల కింద 525 మంది బదిలీలకు అర్హులైనట్లు సమాచారం. జోన్‌-4 పరిధిలో పాత ఉమ్మడి నాలుగు జిల్లాల్లో 55 మంది ఆఫీస్‌ సూపరింటెండెంట్లు ఉన్నారు. వీరికి 30 శాతం బదిలీ నిబంధనల కింద 16 మందిని బదిలీ చేయాల్సి ఉంది. నలుగురు సీని యారిటీ కలిగిన ఆఫీస్‌ సూపరింటెండెంట్లు మాత్ర మే బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒక్కరికి మాత్రమే బదిలీ చేసి మిగిలిన ముగ్గురిని అదేస్థానాల్లో యథా తథంగా కొనసా గించడం వెనుక మతలబేమిటో తెలియడం లేదనే వాదన వినిపిస్తోంది. ముగ్గురిలో ఎవరు కూడా ఎలాంటి సిఫారసు లెటర్లు కలిగిన జాబితాలో లేకపోవడం గమ నార్హం. వీరిలో ఒకరు తిరుపతి కావాలని కోరుకున్నప్పటికీ బదిలీ చేయక పోవడం గమనార్హం. మరొకరు అనంతపురం కావాలని కోరినప్పటికీ తథా తథంగా కొనసా గించడం విశేషం. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటికి చెందిన ఓ సూపరింటెండెంట్‌ దరఖాస్తు చేసుకు న్నప్పటికీ బదిలీ జాబితాలో చూపించకపోవడం గమనార్హం. బదిలీలు ముగిసిన అనంతరం మాడిఫికేషన్‌ కింద కడప జిజిహెచ్‌కు ప్రత్యేక ఉత్తర్వుల పేరుతో బదిలీ చేయ డం విస్మయాన్ని కలిగించింది.
తంతుగానే స్టాటిస్టికల్‌ ఆఫీసర్ల బదిలీలు
జోన్‌-4 పరిధిలో డిప్యూటీ స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌ 15 మంది ఉన్నారు. 30 శాతం బదిలీల నిబంధనల కింద నలుగురిని బదిలీ చేయాల్సి ఉంది. ఇద్దరు అర్హులు ఉన్నప్పటికీ ఏఒక్కరినీ బదిలీ చేయకపోవడంపై విమర్శలు ఉన్నాయి. అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ బదిలీల్లో మాయాజాలమే నడిచిందనే విమర్శలు ఉన్నాయి. 21 మంది అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్లు ఉండగా 30 శాతం నిబంధన కింద నలుగురు అర్హులైన ఉద్యోగులు ఉండగా ఇద్దరిని మాత్రమే బదిలీ చేయడం గమనార్హం. మిగిలిన ఇద్దరిని యథాతథంగా ఉంచడమేమిటో తెలియడం లేదనే వాదన వినిపిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీల్లో చోటుచేసుకున్న తప్పిదాలపై కొంతమంది ఉద్యోగులు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే ప్రయత్నాల్లో ఉండడం గమనార్హం. దీనిపై ఆర్‌డి అనిల్‌కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం పలుమార్లు చేయగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.