Jun 23,2023 21:46

వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలలు

కడప ప్రతినిధి : వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. సిఫారసు లెటర్ల మాటున దశాబ్దాల తరబడి ఉన్నచోటనే పాతుకుపోయారు. ఆర్‌డి కార్యాలయం రికార్డుల నిర్వహణ సక్రమంగా చేయకపోవడంతోనే ఇటువంటి పరిస్థితి తలెత్తిందనే వాదన వినిపిస్తోంది. ఫలితంగా వందలాది మంది అర్హులైన ఉద్యోగులకు అన్యాయం చోటుచేసుకుంటోంది. పలుకుబడి కలిగిన ఉద్యోగులు ఏళ్ల తరబడి ఉన్నచోటనే పాతుకుపోవడంతోపాటు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శ పెద్దఎత్తున వినిపిస్తోంది. తాజాగా ఈనెల 20, 21, 22 తేదీల్లో ఆర్‌డి కార్యాలయ ఉన్నతాధికారులు చేపట్టిన బదిలీల్లో ఇటువంటి ఉద్యోగులను బదిలీ చేయాలని కోరుతూ పలువురు ఉద్యోగులు ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదుల బుట్టదాఖలు కావడం ఆందోళన కలిగిస్తోంది.
వైద్య ఆరోగ్య శాఖ జోన్‌-4 పరిధిలో సుమారు 23 విభాగాలకు పాత ఉమ్మడి జిల్లాల్లో సుమారు ఎనిమిది వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కడప రీజినల్‌ డైరెక్టర్‌ ప్రాంతీయ కార్యాలయం ఈ నెల 20, 21, 22 తేదీల్లో చేపట్టిన బదిలీలకు 700 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 30 శాతం నిబంధన కింద రెండేళ్ల రిక్వెస్ట్‌ బదిలీలు, ఐదేళ్లు కాలపరిమితి నిండిన ఉద్యోగుల పారామీటర్ల కింద 525 మంది బదిలీలకు అర్హులైనట్లు సమాచారం. ఆయా జిల్లాల్లో కీలకమైన స్థానాల్లోని ఉద్యోగులు పలువురు సిఫారసు లెటర్ల మాటున తిష్ట వేసుకుని ఉన్నారనే విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది.
16 ఏళ్లుగా ఫెవికాల్‌ వీరులు
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఎనిమిది మంది సీనియర్‌ అసిస్టెంట్లు సుమారు 20 ఏళ్లుగా తిష్ట వేసుకుని కూర్చున్నారనే విమర్శ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా బదిలీల్లో సదరు సీనియర్‌ అసిస్టెంట్లను యథాతథంగా కొనసాగించడం ఆందోళన కలిగించింది. వీరిని బదిలీ చేసి సీనియారిటీకి ప్రాధాన్యత కల్పించాలని కోరిన ఆశావహుల ఆశలు బుట్ట దాఖలు చేయడం విస్మయాన్ని కలిగించింది. ఇటువంటి ఉదాహరణలు జోన్‌-4 పరిధిలోని బదిలీల్లో కొల్లలుగా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.
కడపలో మూడు స్తంభాలాట
కడపలో ఆర్‌డి కార్యాలయం, డిఎంహెచ్‌ఒ కార్యాలయం, రిమ్స్‌ కళాశాలల మధ్య మూడు స్తంభాలాట కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లు వెత్తుతుండడం గమనార్హం. ఆర్‌డి కార్యాలయం నుంచి నర్సింగ్‌ కళాశాలకు, నర్సింగ్‌ కళాశాల నుంచి ఆర్‌డి కార్యాలయానికి బదిలీలు చేస్తున్నారు. ఐదేళ్లు నిండిన ఉద్యోగులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ కావడం నిబంధనలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజా బదిలీల్లో ఇటువంటి నిబంధనలు సిఫారసు లెటర్ల మాటున నలిగిపోతున్నారు.
ఆర్‌డిలో పైరవీల జోరు
రీజినల్‌ డైరెక్టర్‌ ప్రాంతీయ కార్యాలయం పైరవీలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా మారింది. ఈ నెల 20, 21, 22వ తేదీల్లో వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. బదిలీల ప్రక్రియ ముగిసినప్పటికీ ఖాళీలు ఉన్నాయనే పేరుతో శుక్రవారం భారీగా మాడిఫికేషన్స్‌ పలువురు ఆర్‌డి కార్యాలయాన్ని చేరుకుని విజ్ఞప్తుల ముసుగులో పైరవీలు సాగిస్తున్నార నే వాదన వినిపిస్తోంది.