Oct 29,2023 23:07

కళాకారిణుల నృత్య ప్రదర్శన

సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లుగా భాసిల్లుతున్న విజయనగరంలో ఉత్సవ సంరంభం వైభవంగా ఆరంభమైంది. గ్రామీణ కళలు ఉట్టిపడే కళారూపాలతో శోభాయాత్ర... విజయనగర వైభవాన్ని చాటిచెప్పే శాస్త్రీయ సంగీతాలు... నృత్య కళారూపాలు... అలనాటి పరిస్థితులకు అద్దంపట్టే నాటక ప్రదర్శనలు... విజ్ఞానం విరజిల్లే వైజ్ఞానిక ప్రదర్శన... మేధకు పదునుపెట్టి, చక్కిలిగింతలు పెట్టే కవిసమ్మేళనం... ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో విశేషాలు.. ఇవన్నీ తొలిరోజు విజయనగరం ఉత్సవాల్లో కనిపించిన దృశ్యాలు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ విజయనగరం ఉత్సవాలను పైడితల్లమ్మ ఆలయం వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు.
ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌, కోట : 
విజయనగరం ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ నిర్వహించిన శోభాయాత్రను ఆదివారం మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. పైడితల్లమ్మ ఆలయం నుంచి కోట, సింహాచలం మేడ మీదుగా గురజాడ కళాక్షేత్రం వరకు ఈ ర్యాలీ సాగింది. సుమారు 71 కళారూపాలు, అంశాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొన్నారు.
80 మంది కవులతో కవి సమ్మేళనం
లేడీస్‌ రిక్రియేషన్‌ క్లబ్‌లో 80 మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. సంస్కృత కళాశాల ప్రిన్సిపల్‌ జనార్దనరావు , కవులు జక్కు రామకృష్ణ, చీకటి దివాకర్‌, మింది విజయ మోహనరావు, సూర్య లక్ష్మి, చంద్రిక, చివుకుల శ్రీలక్ష్మి, బాలకృష్ణ, తదితరుల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. అనంతరం కవులను ఘనంగా సన్మానించారు. అనంతరం 108 మంది సాహితీమూర్తుల విరచిత రచనా సమాఖ్య వారి గురు బ్రహ్మ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
విజ్ఞానం పెంపొదించేలా
కోటలో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విజ్ఞానాన్ని పెంపొందించేలా ఉంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇన్నోవేషన్‌ డిపార్టుమెంటు అఫ్‌ డ్రోన్‌ టెక్నాలజీ, సీతం కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు సాంకేతిక పరికరాలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వ ఐటిఐ విద్యార్థులు చెత్తతో తయారు చేసిన బొమ్మలను, చిన్న చిన్న వస్తువులను ప్రదర్శించారు.
ఆకట్టుకున్న నాటికలు, ఏకపాత్రలు
స్థానిక గురజాడ కళాక్షేత్రంలో ప్రదర్శించిన ఏకపాత్రాభినయాలు, సాంఘిక నాటకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వివిధ సామాజిక అంశాలపై స్థానిక నాటక సమాజాలు ప్రదర్శించిన అమ్మో బొమ్మ, రుణాలబంధం, ఒక రాక్షసుడి కథ, ఆఖరి ఉత్తరం, శిక్ష, పుటుక్కు జరజర డుబుక్కుమే నాటికలు ఆలోచింపజేశాయి. చాసో స్మారక భవనంలో ప్రదర్శించిన ఏకపాత్రలు అలరించాయి.

ఆకర్షిస్తోన్న
పుష్ప, ఫల ప్రదర్శన
మహారాజా సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన పుష్ప, ఫల ప్రదర్శనను మంత్రి బొత్స ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఫ్రెష్‌ ఫ్లవర్స్‌, డ్రై ఫ్లవర్స్‌, వెజిటబుల్‌ కార్వింగ్‌, సైకథ శిల్పం, నర్సరీ తదితర మొక్కలను ప్రదర్శించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ పలువురిని ఆకర్షిస్తోంది. పూలు, మొక్కలతో తయారు చేసిన భారత దేశం మ్యాప్‌, పూల పుట్టగొడుగులు, కాఫీ మగ్‌ విత్‌ కప్‌, పూలతో చేసిన పలు రకాల పక్షులు, జంతువులు బార్బీ డాల్‌, వాటర్‌ ఫౌంటెయిన్‌.. పెద్దల్లో, పిల్లల్లో ఆనందాన్ని నింపుతున్నాయి.

మన సంస్కృతీ సంప్రదాయం, కళల పరిరక్షణకు ఇటువంటి ఉత్సవాలు దోహదపడతాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురజాడ కళాక్షేత్రంలో జరిగిన విజయనగరం ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పైడితల్లమ్మ పండగకు వచ్చే యాత్రికులకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.
అందరూ సహకరించాలి
డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ వివిధ కళల్లో నిష్ణాతులు, ప్రావీణ్యం ఉన్న వారి ప్రోద్బలంతో, పెద్దల ఆదేశాలకు అనుగుణంగా మన సంప్రదాయ కళలను ప్రోత్సహి ంచేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. వివిధ కళారూపాలతో, కళాకారులతో నగరానికి కొత్త శోభ వచ్చిందన్నారు. అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు సంకల్పించామని, దీనికి అందరూ సంపూర్ణంగా సహకరించాలని కోరారు.
విజయనగర వైభవానికి ప్రతిబింబాలు
జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయనగరం ఉత్సవాలు మన వైభవానికి, సంస్కృతికి ప్రతిబింబాలన్నారు. ప్రజల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, సంస్కృతి, కళలు, సంప్రదాయాల పరిరక్షణకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
ఇదొక గొప్ప అవకాశం
కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ మన కళలు, సంస్కృతి, సంప్రదాయాల ప్రదర్శనకు ఇదొక గొప్ప అవకాశమని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, అందరి భాగస్వామంతో ఉత్సవ కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ లయ యాదవ్‌, ఎస్‌పి దీపిక, జెసి మయూర్‌ అశోక్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, వివిధ వేదికలు, కార్యక్రమాల ఇన్‌ఛార్జులు సుధాకరరావు, రాజ్‌ కుమార్‌, వి.టి.రామారావు పాల్గొన్నారు.