Feb 23,2023 00:31

పూజలు చేస్తున్న పురోహితులు

ప్రజాశక్తి-నక్కపల్లి: ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్చి 2వ తేదీ నుండి ప్రారంభం కానున్న స్వామి వారి వార్షిక కల్యాణోత్సవములకు సంబంధించి బుధవారం భక్తుల సమక్షంలో వైభవంగా పెళ్లి రాట వేశారు. ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్‌ ఆచార్యులు, అర్చకులు సంకర్షణపల్లి రాజగోపాల కృష్ణమాచార్యులు, ఇల్లింద వెంకట గోపాలచార్యులు, భాగవతం గోపాలచార్యులు ఆధ్వర్యంలో వైభవంగా పెండ్లిరాట ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు ప్రసాద్‌ ఆచార్యులు మాట్లాడుతూ, మార్చి 2న సాయంత్రం అంకురార్పణతో స్వామివారి కల్యాణ మహౌత్సవాలు ప్రారంభమవుతాయని, అదే రోజు రాత్రి తిరువీధి సేవ, 3న ప్రత్యేక అభిషేకాలు ఉంటాయని తెలిపారు. 4, 5వ తేదీలలో రాత్రి స్వామివారి తిరువీధి సేవ, 6న మధ్యాహ్నం సిహెచ్‌ లక్ష్మీపురం గ్రామంలో స్వామివారి తోటలో తోట ఉత్సవము నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. 7న ఉదయం ఆలయంలో మహా పూర్ణాహుతి నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, జెడ్పిటిసి కోఆప్షన్‌ మాజీ సభ్యులు కొప్పిశెట్టి కొండబాబు, శివాలయం చైర్మన్‌ చెరుకూరి వెంకటేశ్వరరావు, యువి శ్రీనివాసరావు సిద్దాబత్తుల కృష్ణ, సూర్యనారాయణ పాల్గొన్నారు.