Oct 21,2023 22:47

క్యూ లైనులో వేచివున్న యాత్రికులు



శ్రీ సంతోషిమాతదేవిగా దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మి
ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా స్థానిక చిట్టినగర్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు దసరా ఉత్సవాల ఏడవరోజైన శనివారం శ్రీ సంతోషిమాత దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని గవర్నర్‌ కార్యాలయ జాయింట్‌ సెక్రెటరీ సూర్య ప్రకాష్‌ దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం పాలకవర్గం స్వాగతం పలికి అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి శాలువతో సత్కరించారు. అలాగే నగరాల సామాజిక వర్గ ప్రముఖులు, నగరాల ఆశాజ్యోతి బాయన వెంకట్రావు, కార్పొరేటర్‌ మరుపిళ్ళ రాజేష్‌ తదితరులు అమ్మవారిని దర్శించుకోగా వారిని ఆలయ కమిటీ సముచిత రీతిన సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని చెప్పారు. దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళావేదికపై నిత్యం సాయంత్రం వేళల్లో జరుగుతున్న సాంస్కతిక కార్యక్రమాలకు భక్తుల నుండి చక్కటి ఆదరణ లభిస్తోందని చెప్పారు. దసరా ఉత్సవాల కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి ఉపాధ్యక్షులు మరుపిళ్ళ సత్యనారాయణ, బెవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు పొట్నూరి దుర్గాప్రసాద్‌, శీరం వెంకట్రావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కొరగంజి భాస్కరరావు, కార్యవర్గ సభ్యులు పోతిన బేసికంటేశ్వరుడు పాల్గొన్నారు.
అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాల్లో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కనకదుర్గా నగర్‌లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక ఉత్సవాలు అలరిస్తున్నాయి. చిన్నారులు చేస్తున్న కూచిపూడి, భరత నాట్యం, శివుని వేషధారణలో శివాష్టకం వంటి పలు సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం
ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : ఇంద్ర కీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగ రంగ వైభవంగా జరుగు తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనం కోసం క్యూ లైనులో భక్తులు దర్శనం చేసుకునేందుకు కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి అలంకారాల్లో లలితా త్రిపుర సుందరీ దేవిని శనివారం సుమారు లక్ష మంది వరకూ దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు కూడా కొద్దిమంది భవానీమాల ధరించి అమ్మవారి దర్శనానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి తరలివచ్చారు. అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయడంతో క్యూ లైన్లన్నీ సాఫీగా ముందుకు సాగాయి. వివిధ స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు కూడా యాత్రికులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు.
అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
దసరా శరన్నవరాత్రుల ఏడో రోజు శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. ఈ నేపధ్యంలో దుర్గమ్మను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అంతరాలయం దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచన మండపంలో ఆశీర్వచనాలు అందించారు. అమ్మవారి శేషవస్త్రాన్ని, తీర్థప్రసాదాలను ప్రముఖులు అందుకున్నారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌, పార్థసారధి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌. సత్యనారాయణ, సినీ నటి పూనం కౌర్‌, టిడిపి నాయకురాలు పరిటాల సునీత, విజిలెన్స్‌ కమిషనర్‌ జె.సత్యనారాయణ పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో వున్నారు.
కొందరు పోలీసుల అత్యుత్సాహం : మండిపడ్డ మంత్రి సత్యనారాయణ
ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాలలో కొంతమంది పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించటం వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉండటమే గాక ఆలయానికి వచ్చే యాత్రికుల మనోభావాలు దెబ్బతింటాయని ఓ మంచి భక్తి వాతావరణంలో అమ్మవారిని దర్శనాలు చేసుకునేవిధంగా పోలీసులు వ్యవహరించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నేపధ్యంలో ఏర్పాట్లను మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యవేక్షించారు. అనంతరం మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు, నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతి రాణా టాటా, సబ్‌ కలెక్టర్‌ తదితర అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అపశృతులు చోటుచేసుకోకుండా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తే క్షేత్రస్థాయిలో కొందరు పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించటంపై మండిపడ్డారు. కొందరు పోలీసులు తమ వారిని దర్శనాలకు పంపించి, ఇతరుల పట్ల వివక్ష ప్రదర్శించటం సరికాదన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన యాత్రికులకు కనకదుర్గా నగర్‌లో అన్నప్రసాద పంపిణీ చక్కగా జరుగుతుంటే ఓ పోలీస్‌ అధికారి వాటిని నివారించటం గమనించి తిరిగి అన్నదానం జరిగేలా చేశామన్నారు. విధి నిర్వహణలో ఉన్న దేవస్థానం ఉద్యోగులను అడ్డుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిపికి సూచిం చారు. రానున్న రెండు రోజులూ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు, పాలకమండలి సమన్వయంతో ఉత్సవాలను విజయవంతానికి కృషి చేయాలని కోరారు.
అర్చక సభ, పారితోషికాలు అందజేత
వన్‌టౌన్‌ : దసరా శరన్నవరాత్రుల వేడుకల సందర్భంగా ఇంద్రకీలాద్రి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ మల్లికార్జున మహా మండపం, ఆరవ అంతస్తులో శనివారం అర్చక సభ జరిగింది. ఈ సభలో వివిధ ప్రాంతాలకు చెందిన 175 మంది అర్చకులకు రూ. 3,500 చొప్పున పారితోషకాలు అందించారు. లడ్డు ప్రసాదాన్ని, అమ్మవారి శేష వస్త్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, ఆలయ పాలక మండల చైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో కేఎస్‌ రామారావు పాల్గొన్నారు.
శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం నుండి
పట్టు వస్త్రాలు, సారె
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న జగన్మాతకు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి సారె సమర్పించడం ఒక సంప్రదాయం. ఇందులో భాగంగా శనివారం తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ప్రతినిధుల బందం ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. ప్రతినిధుల బందం అమ్మవారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం తీసుకుంది.
ఇంద్రకీలాద్రిపై ఉచిత వైద్య సేవలు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులకు ఉచిత వైద్య సేవలను అందించేందుకు నగరంలోని డాక్టర్‌ ఎం.జె.నాయుడు హాస్పటల్‌ వైద్య బృందం కృషి చేస్తుందని ఆసుపత్రి గౌరవ చైర్మన్‌ డాక్టర్‌ వావిలాల రజనీకాంత శర్మ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై శనివారం 862 మందికి ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన వారికి మందులు కూడా అందించినట్లు తెలిపారు. దసరా ఉత్సవాలు తొమ్మిదిరోజుల పాటు ఆసుపత్రి వైద్య బృందం సేవలను అందించనుందని తెలిపారు.