Sep 25,2023 23:56

వైభవంగా శ్రీవారి రథోత్సవం

వైభవంగా శ్రీవారి రథోత్సవం
ప్రజాశక్తి - తిరుమల
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మౌత్సవాలలో ఎనిమిదో రోజైన సోమవారం ఉదయం 6.55 నుండి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి దంపతులు, ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్‌ పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయ సిబ్బందికి వస్త్ర బహుమానం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సేవలందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహనం బేరర్లు, మేళం సిబ్బందికి సోమవారం రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కలిసి వస్త్ర బహుమానం అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి చేతులమీదుగా వస్త్రాలను అందించారు.ఈ సందర్భంగా ఈవో ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి దంపతులు ప్రతి సంవత్సరం బ్రహ్మౌత్సవాల్లో సిబ్బందికి వస్త్ర బహుమానం అందిస్తున్నట్టు చెప్పారు. వారికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.
శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఆలయ డెప్యూటీ ఈవో శాంతి,ప్రధానార్చకులు ఎపి.శ్రీనివాస దీక్షితులు, ఏఈవో మునిక్రిష్ణారెడ్డి, సూపరింటెండెంట్‌ మోహన్‌రావు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ధనంజయరావు పాల్గొన్నారు.