ప్రజాశక్తి-గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తమ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమం వేడుకగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య 8.05 నుంచి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీ వీ కృష్ణారెడ్డి, సుధారెడ్డిల పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పీ.వీరారెడ్డి, విజయలక్ష్మి, కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయభాస్కరమ్మ దంపతులు పాల్గొన్నారు. ద్వజారోహణలో భాగంగా గరుత్మంతుడి రూపాన్ని ఆలయ ధ్వజస్తంభానికి ఆరోహణం చేశారు. ఈ సందర్భంగా ధ్వజారోహణ విశిష్టతను వేదపండితులు వివరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని సూర్యప్రభ వాహనంలో తొలుత ఆలయ మండపానికి తీసుకొచ్చారు. భక్తుల దర్శన అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు డోకిపర్రు గ్రామంలో శేష, హంస వాహనాల్లో విహరించి భక్తులను అలరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం గజవాహనోత్సవం, విశేష తిరుమంజనం, రథోత్సవం, ఊంజల సేవ, గరుడోత్సవం, ఆస్థానం, ఏకాంత సేవలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.










