Apr 03,2023 00:03

అప్పన్న కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు, పాల్గొన్న భక్తులు

ప్రజాశక్తి-సింహాచలం: సింహాద్రి అప్పన్న వార్షిక కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణోత్సవంలో భాగంగా స్వామివారిని ఆదివారం వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపారు. ఆరాధన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం కోలాటోత్సవం, ఎదురు సన్నాయోత్సవం అనంతరం రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో దేవస్థానం ఈవో వి.త్రినాధరావు దంపతులతోపాటు దేవస్థానం వివిధ విభాగాల అధికారులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రథోత్సవం అనంతరం స్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణమండపం వద్దకు చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి పదిన్నర గంటలకు స్వామివారి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, భోజన వసతిని కల్పించారు. కల్యాణోత్సవాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా భారీ స్క్రీన్‌లను ఏర్పాటుచేశారు. గట్టి పోలీస్‌ బందోబస్తు, వైద్య శిబిరాలను కూడా ఏర్పాటుచేశారు. అంబులెన్సులను, అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచారు. భక్తులు కొండ దిగువనుంచి పైకి వెళ్లేందుకు దేవస్థానం అధికారులు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. కల్యాణం అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని, అక్షింతలను ప్రత్యేక కౌంటర్లలో అందుబాటులో ఉంచారు.