ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో రాఘవేంద్రుని స్వర్ణ పల్లకోత్సవం వైభవంగా సాగింది. రాఘవేంద్రస్వామి సప్త రాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యారాధన సందర్భంగా పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు ఆధ్వర్యంలో స్వర్ణమయమైన రాఘవేంద్రస్వామి మూర్తిని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీమఠం ప్రాకారంలో భక్తుల జయజయ ధ్వనుల మధ్య ఘనంగా ఊరేగించారు.
బృందావనానికి మహా పంచామృతాభిషేకం
శ్రీరాఘవేంద్రస్వామి మూల బృందావనానికి పీఠాధిపతులు మహా పంచామృతాభిషేకం నిర్వహించారు. పూజారులు బృందావనాన్ని నిర్మాల్యం చేసి తులసి అర్చనతో మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం బృందావనానికి పంచామృతాభిషేకం నిర్వహించారు. బృందావనాన్ని స్వర్ణకవచాలతో, పట్టు వస్త్రాలతో, వివిధ పుష్ప హారాలతో అలంకరించారు. రాఘవేంద్రుని ఆరాధ్య దైవమైన మూల రాములుకు పీఠాధిపతులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీమఠం పూజా మందిరంలో, స్వర్ణ మండపంలో మూల రాములు, జయరాములు, దిగ్విజయరాముల మూర్తులకు పంచామృతాభిషేకము నిర్వహించారు.
టిటిడి పట్టు వస్త్రాలు, ప్రసాదం ఊరేగింపు
టిటిడి నుంచి తెచ్చిన పట్టువస్త్రాలను, ప్రసాదాలను ఘనంగా ఊరేగించారు. టిటిడి జెఇఒ వీరబ్రహ్మేంద్ర ఆధ్వర్యంలో తీసుకొచ్చిన పట్టువస్త్రాలు శ్రీమఠం ప్రధాన ఆర్చి వద్దకు చేరుకున్న నేపథ్యంలో శ్రీమఠం ఎఎఒ మాధవశెట్టి, మేనేజర్ ఎస్‌కె.శ్రీనివాసరావు స్వాగతం పలికారు. జెఇఒ వీరబ్రహ్మేంద్ర ఎస్‌కె.శ్రీనివాసరావుకు అప్పగించగా ఆయన తలపై పెట్టుకుని శ్రీమఠం ముఖద్వారం వరకు తెచ్చి పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులకు అప్పగించారు. ఆయన కూడా పట్టు వస్త్రాలు, శ్రీవారి లడ్డూను తలపై పెట్టుకుని బృందావనం ముందు ఉంచి సమర్పించారు.
శ్రీమఠంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు
శ్రీరాఘవేంద్రస్వామిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు దినేష్ కుమార్, శివశంకర్ గౌడ్ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం చేరుకున్న వారికి శ్రీమఠం సహాయ మేనేజర్ ఐపి.నరసింహ మూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్ ఘన స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు.
రాఘవేంద్రుని దర్శించుకున్న ప్రదీప్ రెడ్డి
శ్రీరాఘవేంద్రస్వామిని వైసిపి రాష్ట్ర యువజన నాయకులు వై.ప్రదీప్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీమఠం చేరుకున్న ఆయనకు శ్రీమఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపి.నరసింహమూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. వైసిపి మండల నాయకులు బూదూరు లక్ష్మి నారాయణ రెడ్డి, సర్పంచి తెల్లబండ్ల భీమయ్య, రైల్వే అధికారులు పిసిఒఎం సికింద్రాబాద్ నాగ్య నాయక్, గుంతకల్ సీనియర్ డిఒఎం శ్రవణ్ కుమార్, ఎస్‌ఎం ఆర్వాసునిక్, సిసిఐ నదీర్ షా, తుంగభద్ర స్టేషన్ మాస్టర్ సిద్ధారెడ్డి, సిబిఎస్ ఆర్ కాశీనాథ్, ఎస్‌ఐ వేణుగోపాల్ రాజు ఉన్నారు.










