Mar 09,2023 22:31

ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు: శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్నతిరునాళ్లు ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం రాత్రి అత్యంత ప్రధాన ఘట్టమైన పుట్టింటి పసుపు కుంకుమ మహోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా అనిగండలపాడు గ్రామంలోని అమ్మవారి వంశీకులు కొల్లా శ్రీనివాసరావు నివాసం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక తయారు చేసిన ప్రభపై పసుపు కుంకుమలను ఊరేగిస్తూ తీసుకొచ్చారు. డీసీపీ మేరీ ప్రశాంతి, ఎసిపి నాగేశ్వర్‌ రెడ్డి పర్యవేక్షణలో సీఐ నాగమురళి, ఎస్‌ఐ హరి, పోలీస్‌ సిబ్బంది ప్రత్యేకమైన రోప్‌ వే ఏర్పాటు చేసి మున్నేటి కాజ్‌ వే మీదుగా పోలీస్‌ స్టేషన్‌ సెంటర్‌ నుండి అమ్మవారి ఆలయానికి చేరుకున్న పసుపు కుంకుమలకు ఆలయ ఇఒ లీలాకుమార్‌, చైర్మన్‌ చెన్నకేశవరావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో పుట్టింటి వారికి ఆలయ అధికారులు పానకం ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ లక్ష్మీకళ్యాణి, ఎంపిడిఒ ప్రసాదరావు పాల్గొన్నారు.