Mar 21,2023 21:11

ప్రభోత్సవంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు


వైభవంగా ప్రభోత్సవం
- నంది వాహనంపై స్వామి అమ్మవార్లు
ప్రజాశక్తి - శ్రీశైలం

      ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం క్షేత్రంలో జరుగుతున్న ఉగాది మహోత్సవాలలో మంగళవారం స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం, నంది వాహన సేవ, భ్రమరాంబ దేవికి మహా సరస్వతి అలంకారం కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయంకాలం ప్రభోత్సవం నిర్వహించారు. అనంతరం పల్లకిలో మంగళ వాయిద్యాల మధ్య రథశాల వద్దకు తీసుకురావడం జరిగింది. 11 రకాల పూలతో అలంకరించి ఏర్పాటు చేసిన ప్రభోత్సవంలో స్వామి అమ్మ వార్ల ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత రథసాల వద్ద నుండి నంది గుడి వరకు, తిరిగి నంది గుడి వద్ద నుండి రథసాల వద్ద వరకు వివిధ రకాల మధ్య ప్రదర్శన, కళాకారుల మధ్య ప్రభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
నంది వాహనంపై స్వామి అమ్మవార్లు
ఉత్సవాల్లో భాగంగా ప్రభోత్సవ అనంతరం అలంకార మండపంలో స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను వివిధ రకాల పూలతో అలంకరించిన నంది వాహనంపై ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారిని మహా సరస్వతి అలంకారంలో అలంకరించారు. ఆ తర్వాత నంది వాహనంపై స్వామి అమ్మవార్లను, మహా సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారిని చెక్కభజన, కోలాటం కళారూపాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు.
అగ్నిగుండ ప్రవేశం : ఉగాది ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల భక్తులు మంగళవారం రాత్రి అగ్నిగుండ ప్రవేశం చేసి వీరాచార విన్యాసాలు నిర్వహించారు. పాతాళ గంగ రోడ్డులోని శివదీక్ష శిబిరాలలో అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశారు. సంప్రదాయంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాలుకకు సువ్వలు, గొంతుకు, బుగ్గలకు గుచ్చుకొని అగ్నిగుండ ప్రవేశం చేసి భక్తిని చాటుకున్నారు.
నేడు ఉగాది: నేడు తెలుగు సంవత్సరాది ఉగాది నూతన సంవత్సరం స్వామి అమ్మ వాళ్లకు విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంకాలం రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా వేలాది మంది భక్తుల మధ్య సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తారు. అమ్మవారికి రమావాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారంలో అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.