కొత్త అమావాస్య సందర్భంగా నూకాలమ్మ పండగ మహోత్సవాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్య భక్తులు గ్రామాల్లోని నూకాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
ప్రజాశక్తి- దేవరాపల్లి
మండలంలోని ఏ.కొత్తపల్లి, ఎం.అలమండ, కాశీపురం తదితర తదితర గ్రామాలలో నూకాలమ్మ ఆలయాలు భక్తులతో కిటికిటలాడాయి. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు పళ్ళు, కాయలు, పసుపు కుంకుమ, నూతన వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. ఏ.కొత్తపల్లి, ఎం.అలమండ గ్రామాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో భక్తులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత వర్షం తెరిపివ్వడంతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఎ.కొత్తపల్లి, ఎం.అలమండ సర్పంచులు చింతల వెంకటరమణ, దాడి జగన్ పాల్గొన్నారు.
కశింకోట : మండలంలోని ఉగ్గినిపాలెం గ్రామంలో నూకాంబిక అమ్మవారిని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కలగా లక్ష్మి, సర్పంచ్ కలగా గున్నయ్యనాయుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిషోర్ పాల్గొన్నారు.
యలమంచిలి రూరల్ : పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూకాంబిక ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకొని కుంకుమ పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సత్యసాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుండి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
బుచ్చయ్యపేట : మండలంలోని పెదపూడి, కేపీ అగ్రహారం గ్రామాల్లో నూకాలమ్మ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. చోడవరం మాజీ శాసనసభ్యులు కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబు, పార్టీ మండల అధ్యక్షులు గోకువాడ కోటేశ్వరరావు తదితరులు ఆయా గ్రామాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. కేపీ అగ్రహారంలో మంగళవారం రాత్రి జిల్లాస్థాయి తప్పెటగుళ్ల పోటీలను నిర్వహించారు.
వడ్డాది : బుచ్చయ్య పేట మండలం వడ్డాది, బంగారు మెట్ట, పొట్టి దొరపాలెం, లోపూడి, గంటి కొరళం గ్రామాల్లో నూకంబిక అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు చీర జాకెట్ గాజులు పసుపు కుంకుమతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు జడ్పిటిసి దొండా రాంబాబు, వైస్ ఎంపీపీ దొండా లలిత నారాయణమూర్తి, స్థానిక నాయకులు వడ్డాదిలో అమ్మవారిని దర్శించుకున్నారు.
కె.కోటపాడు : మండలంలోని చౌడువాడ గ్రామంలో నూకాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదం స్వీకరించారు. పలు సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి దాడి ఎరుకు నాయుడు, విశాఖ డెయిరీ డైరెక్టర్ సుందరపు గంగాధర్, ఎంపీటీసీ ఏటుకూరు రాజేష్, సుగర్ ఫ్యాక్టరీ మాజీ డైరెక్టర్ రాజి శ్రీనివాసరావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. మండలంలోని దాలివలస గ్రామంలో నూకాంబిక అమ్మవారి పండగకు టిడిపి మాడుగుల నియోజకవర్గం ఇన్‌ఛార్జి పివిజి.కుమార్ రూ.5వేలు విళారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కసిరెడ్డి అప్పలనాయుడు, సబ్బవరపు రామునాయుడు, జూరెడ్డి రాము తదితరులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : మండలంలోని అచ్యుతాపురం, మోసయ్యపేట, కొండకర్ల, మడుతురు, మార్టూరు, చౌడపల్లి తదితర గ్రామాల్లో నూకాలమ్మ పండగ మహోత్సవాలు నిర్వహించారు. కొండకర్ల గ్రామంలో అగ్నిగుండం ఏర్పాటు చేసి భక్తులు అగ్ని గుండాలపై నడిచారు.
పరవాడ : పరవాడ గ్రామంలో నూకాలమ్మతల్లి పండుగ సందర్భంగా అమ్మవారిని ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరవాడ సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు, ఉప సర్పంచ్ బండారు రామారావు, మాజీ సర్పంచ్‌లు పైల అప్పారావు, చుక్క రామునాయుడు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
నక్కపల్లి : కొత్త అమావాస్యను పురష్కరించుకుని ఉపమాక గ్రామంలో సోమవారం రాత్రి గ్రామంలో నూకాలమ్మ తల్లి ప్రతిమలు (గరగలను) డప్పుల వాయిద్యాలతో ఊరేగించారు. మంగళవారం ఉదయం తాటి చెట్ల పేడలను పాతి వాటికి తాడుకట్టి ఊయలను తయారు చేసారు. ఈ ఊయలపై అమ్మవారి ప్రతిమలను (గరగలను) కూర్చొండబెట్టి ఊయల ఊపుతూ , పాటలు పడుతూ ఎంతో సందడిగా గ్రామపెద్దలు, యువకులు నిర్వహించారు. రామాలయం ఎదుట నీళ్ళుతో శుభ్రంగా నేలను తడిపి కట్టెలతో నాగళి (ఏరులు) తయారు చేసి చిన్నారులతో నాగళి లాగించారు. ఇలా చేయడంతో సంవత్సరమంతా పాడి పంటలు సవమృద్ధిగా పండుతాయని ప్రజల నమ్మకం.
మండలంలో పలు గ్రామాల్లో మంగళవారం నూకాలమ్మతల్లి పండుగను భక్తులు భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. కొత్త అమావాస్య సంధర్భంగా నూకాలమ్మ జాతర కోసం గ్రామాల్లో అమ్మవారి ఆలయాలను అందంగా ముస్తాబు చేసారు. రంగులు వేసి విద్యుద్దీకరణతో అలంకరించారు.
నర్సీపట్నంటౌన్ : నర్సీపట్న, ఓఎల్.పురం, వేములపూడి, ధర్మసాగరం, మెట్టపాలెం, చెట్టుపల్లి, అమలాపురం నీలంపేట గ్రామాల్లో కొత్త అమావాస్య సందర్భంగా నూకాలమ్మ పండుగ ఘనంగా జరిగింది. అబీద్‌సెంటర్‌లోని ఆలయం సోమవారం రాత్రి 12 గంటల నుండి భక్తులతో కిటకిటలాడింది. సరస్వతీ ప్రెస్ కూడలి వరకు భారీగా క్యూ కట్టారు. ఆలయ చైర్మన్ దనిమిరెడ్డి నాగు, సన్యాసిపాత్రుడు, మునిసిపల్ వైస్‌చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, దనిమిరెడ్డి ప్రసాద్, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
కోటవురట్ల : మండలంలోని కైలాసపట్నం, కోటవురట్ల, వెంకటాపురం గ్రామాల్లో నూకాలమ్మను అధిక సంఖ్యలో మహిళలు దర్శించుకున్నారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
గొలుగొండ : మండలంలో లింగంపేటలోని నూకాంబిక దేవాలయంకు వందలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తుల సౌకర్యార్ధం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో తలనీలాలు సమర్పించడానికి, తాగునీటికి, ప్రసాదాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయం నుండి ప్రధాన రహదారి వరకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో భారీ విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో పలు దుకాణాలను ఏర్పాటు చేయడంతో భక్తులు భారీగా కొనుగోలు చేశారు.
భారీ అంబలం పూజ
అనకాపల్లి : స్థానిక నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య నెలరోజుల జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని నూకంబిక మాలధారణ సంఘం ఆధ్వర్యంలో ఆలయం వద్ద మంగళవారం భారీ అంబలం పూజ నిర్వహించారు. సంఘం వ్యవస్థాపకులు పొలిమేర శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమ్మవారి పాటలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.










