ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
స్థానిక వైఎంహెచ్ హాలులో అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు సాగిన అభినయ నృత్యభారతి 27వ వార్షికోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. హేలాపురి లయన్స్ క్లబ్ సర్వీస్ ట్రస్ట్, హిందూ యువజన సంఘం, లయన్స్ జిల్లా 316జి, నెహ్రూ యువకేంద్రం సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు హేలాపురి ప్రజలకు నాట్య విందును అందించాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన యువ శాస్త్రీయ నర్తకులు 15 మందికి నృత్య కౌముది, ఎనిమిది మంది సేవా తత్పరులకు సేవాతపస్వి, 10 మంది నాట్యాచార్యులకు సేవా తపస్వి అవార్డులు అందించారు. 300 మంది చిన్నారులకు నృత్యపోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. చివరిరోజు కార్యక్రమంలో కలకత్తాకు చెందిన అతనుదాస్, కరుణా కేతన్ భక్త భరతనాట్యం, శ్రీజయని ఘోష్ మోహిని అట్టం, సిర్పూర్‌కు చెందిన గురుదేవ్ పేరిణి శివతాండవం, విజయవాడకు చెందిన శృతిసమన్వి, వరంగల్‌కు చెందిన శ్రీజ ఆంధ్రనాట్యం, హైదరాబాద్‌కు చెందిన రిత్విక్ వెంకట్, చార్మిళ వెంకట్ ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్థులను చేశాయి. కళారత్న కెవి.సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలనతో నృత్య ప్రదర్శన ప్రారంభమైంది, శైవ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామీజీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మూడు రోజులు ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించిన నాట్యాచార్య లయన్ దువ్వి హేమసుందర్‌ను అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వపు జిల్లా గవర్నర్ డాక్టర్ సిహెచ్.సత్యనారాయణమూర్తి, ఎల్.వెంకటేశ్వ రావు, అఖిల భారత తెలుగుసేన రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ చౌదరి, జాతీయ మహిళా అధ్యక్షురాలు సిహెచ్. శ్రీదేవి, మలేసియా భరత నాట్య గురువు శ్రీగణేషన్, ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ కనుమూరి రమేష్, సీనియర్ న్యాయవాది కానాల రామకృష్ణ, సిఆర్‌ఆర్ కళాశాల పిజి కరస్పాండెంట్ కానాల శ్రీనివాస్ పాల్గొన్నారు.










