ప్రజాశక్తి-పాడేరు టౌన్: మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల రెండో రోజైన సోమవారం వేకువజాము నుంచే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో సందడి నెలకొంది. శతకంపట్టు వద్ద కొలువైన ఉత్సవ విగ్రహం, పాదాలను, అమ్మవారి ఆలయంలోని మోదకొండమ్మను మన్యం నలుమూలల నుంచే కాకుండా మైదాన ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు, పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. పట్టణంలో ఎటు చూసినా సందడి వాతావరం నెలకొంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జైంట్ వీల్, డ్రాగన్ ట్రైన్, గాల్లో తేలియాడే పడవ, చిన్నపిల్లల ఆటల పరికరాలు ఏర్పాటు చేయడంతో చిన్న, పెద్దలతో సందడి నెలకొంది. ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్‌పి అతుల్ సిన్హా, ఎఎస్‌పి ధీరజ్ కునుబిల్లి పర్యవేక్షణలో స్థానిక సిఐ బి.సుధాకర్, ఎస్‌ఐలు లక్ష్మణరావు, రంజిత్, ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలువురు సిఐలు, ఎస్‌ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలంకరణ అందర్నీ ఆకట్టుకుంటుంది. వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవాలకు వచ్చే వారంతా విద్యుత్తు లైటింగ్ లను ఎంతో ఆసక్తిగా తిలకించారు. అమ్మవారి ఆలయం మొదలుకుని ప్రధాన మార్గాలు, కూడళ్లలో ఏర్పాటు చేసిన లైటింగ్ కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. పట్టణంలోని ఆయా కూడళ్లలో ఏర్పాటుచేసిన దేవత రూపాల లైటింగ్ సెట్ లు ఆకర్షనీయంగా ఉన్నాయి.
అనుపోత్సవం నేడు..
మోదకొండమ్మ మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా ముగింపు రోజైన మంగళవారం అనుకోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాటు చేస్తున్నారు. తొలి రోజు శతకంపట్టులో కొలువుతీరిన మోదకొండమ్మ భక్తుల పూజలు అందుకుంటుంది. తొలి రోజు ఆలయం నుంచి ఊరేగింపుగా శతకం పట్టు వద్దకు తీసుకుని వచ్చి కొలువు తీర్చిన అమ్మవారి ఉత్సవ విగ్రహం పాదాలను తిరిగి ఆలయంలో కొలువు తీర్చే అనుపోత్సవాన్ని మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఆకట్టుకున్న స్టాల్స్
మోదకొండమ్మ అమ్మవారి జాతరను పురస్కరించుకుని ఐటిడిఎ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రదర్శించిన స్టాల్స్ కు మంచి స్పందన లభిస్తోంది. మన్యంలోని ఐటిడిఎ పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయి. ప్రజలకు రాయితీపై అందిస్తున్న పథకాలపై వారికి అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రచార స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ ప్రహరీని అనుకుని ప్రధాన రహదారి వద్ద ఏర్పాటుచేసిన ఈ స్టాల్స్‌ను పండగకు విచ్చేసిన భక్తులు సందర్శిస్తున్నారు. ఐటిడిఎ చేపట్టిన అభివృద్ధిపై సమాచార శాఖ ఆధ్వర్యంలో ఫోటో ప్రదర్శన, జిసిసి, వ్యవసాయ, ఉద్యానవన, కాఫీ, ఐసిడిఎస్, వెలుగు, తదితర శాఖలు చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లు చూపులను ఆకట్టుకున్నాయి. ప్రతి విభాగం నుంచి ఇన్ ఛార్జిగా ఉన్న ఉద్యోగి వీక్షకులకు పథకం గొప్పతనాన్ని, పథకం ద్వారా జరిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాలను కళ్ళకు కట్టినట్లు ప్రచార స్టాల్స్ ద్వారా వివరిస్తున్నారు.










