Feb 19,2023 21:47

రథోత్సవంలో పాల్గొన్న వేలాది మంది భక్తులు

వైభవంగా మల్లన్న రథోత్సవం
- కమనీయంగా తెప్పోత్సవం
ప్రజాశక్తి - శ్రీశైలం

    శ్రీశైలంలో జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామిఅమ్మవార్ల రథోత్సవం అంగరంగ వైభవంగా, కమనీయంగా సాగింది. రాత్రి 8 గంటలకు పుష్కరిణి వద్ద తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఉదయం స్వామి అమ్మవార్లకు విశేషపూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల మధ్య తీసుకువచ్చి రథంపై ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం 4 గంటలకు రథాంగ దేవతా పూజ, హౌమం, బలి సమర్పణ నిర్వహించారు. 5 గంటలకు పురవీధుల్లో స్వామిఅమ్మవార్ల రథోత్సవంలో పలు సాంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శనల మధ్య రథశాల వద్ద నుండి నంది గుడి వరకు, తిరిగి రథశాల వద్ద వరకు అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించారు. రథోత్సవంలో వేలాది మధ్య భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటలకు పుష్కరిణి వద్ద తెప్పోత్సవ కార్యక్రమంలో స్వామి అమ్మ వార్ల ఉత్సవ మూర్తులను ఆలయం నుండి మంగళ వాయి ద్యాలతో తీసుకువచ్చి తెప్పోత్సవంలో ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.