మహా శివరాత్రి వేడుకలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో శివాలయాలు కిటకిటలాడాయి. శివరాత్రి సందర్భంగా పలు ఆలయాల వద్ద అన్నసమారాధన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజాశక్తి-పాడేరు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పాడేరులో ఉమా నీల కంఠేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. ఆలయం వద్ద మధ్యాహ్నం ఏర్పాటు చేసిన భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదాలను స్వీకరించారు.ఉమానీల కంఠేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన మహాన్యాస రుద్రాభిషేక పూజలలో పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, డాక్టర్ తమర్భ నర్సింగరావు, ఆలయ కమిటీ సభ్యులు ఉమానీల కంఠేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొట్టగుళ్ళి సింహాచలం నాయుడు, పాడేరు సర్పంచ్ కొట్టగుళ్ళి ఉషారాణి, ఆధ్యాత్మిక సేవా బృందం ప్రధాన కార్యదర్శులు ఉప్పల వెంకటరత్నం , శివరాత్రి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కొట్టగుళ్ళి రామారావు, కొట్టగుళ్ళి రమేష్ నాయుడు, కొట్టగుళ్ళి పోతురాజు, సంయుక్త కార్యదర్శులు పలాసి బాలన్న, సిద్ధరాతి కొండలరావు పాల్గొన్నారు.
బొర్రా గుహల్లో తిలకించిన భక్తులు
అనంతగిరి:మండలంలో బొర్రా గుహలు, లొంగపర్తి, శంకుపర్తి ప్రాంతాలలో శివరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ప్రముఖ పర్యాటన కేంద్రమైన బొర్రా గుహల్లో భక్తుల సౌకర్యార్థం పర్యాటకశాఖ ఉచిత ప్రవేశం కల్పించారు. సర్పంచ్ జన్ని అప్పారావు ఆధ్వర్యంలో పలు సాంస్కత కార్యక్రమాలు నిర్వహించారు. బొర్రా గుహలలో శివాలయాన్ని చత్తీష్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వేలాధి మంది భక్తులు దర్శించుకున్నారు. లుంగపర్తి, శంకుపర్తే గ్రామాలలో శివాలయాలకు భక్తులు తరలి వెళ్లారు.
జి.మాడుగుల: మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారి జాము నుంచే శివాలయాలన్నీ కిటకిటలాడాయి. పలుచోట్ల భక్తులకు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద అన్న సమరాధన ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్ డిఎస్‌పి కెసి రాజా, ఇన్స్పెక్టర్ ఝాన్సీరామ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
రాజవొమ్మంగి : మహాశివరాత్రిని పురస్కరించుకొని శనివారం మండలంలోని రాజవొమ్మంగి, జడ్డంగి, వాతంగి, లబ్బర్తి, కుంతిదేవి వాక, అమ్మిరేకుల తదితర గ్రామాల్లో ఉన్న శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రాజవొమ్మంగి, జడ్డంగిలో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ కమిటీలు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. వేలాదిమందికి అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాజవొమ్మంది సీఐ ఎస్‌కె బాజీలాల్ ఆధ్వర్యంలో రాజవొమ్మంగి, జడ్డంగి ఎస్‌ఐలు టీజీ నరేంద్ర ప్రసాద్, షరీఫ్‌లు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు, ఆలయాల వద్ద ఏర్పాట్లను రాజవొమ్మంగి తహాశీల్దార్ సుబ్రహ్మణ్య ఆచారి, ఎంపీడీవో కె బాపన్నదొర పర్యవేక్షించారు.
కొయ్యూరు : మండలంలోని కొయ్యూరు, గాదిగుమ్ము, చింతలపూడి తదితర గ్రామాల్లో ఉన్న శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాల వద్ద ఆలయ కమిటీలు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. కొన్ని ఆలయాల వద్ద అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. కొయ్యూరు సీఐ స్వామి నాయుడు ఆధ్వర్యంలో కొయ్యూరు, మంప ఎస్‌ఐలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీలేరు : మహాశివరాత్రి వేడుకలు జికె.వీధి మండలం సీలేరులో అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక శివాలయంలో పంచామృతాలతో శివలింగానికి అభిషేకాలు పూజా నిర్వహించారు. భక్తులు సీలేరు నదిలో స్నానాల ఆచరించి శివాలయంలో పూజలు చేశారు. అలాగే జీకే వీధి మండలం దారకొండ శివాలయంలోనూ శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రా ఒడిశా సరిహద్దుల నుండి గిరిజనులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
రంపచోడవరం : మండలంలోని రంప గ్రామంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులకు రంపచోడవరం భాను సప్లై అధినేత బత్తిన శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులు అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహశీల్దారు పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే శివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆర్‌డబ్ల్యుఎస్ ద్వారా తాగునీరు, వైద్య ఆరోగ్యశాఖ ద్వారా వైద్య శిబిరం, జీసీసీ ద్వారా పూజా సామాగ్రి, ఏపిఈపిడిసిఎల్ ద్వారా కరెంటు, పంచాయతీశాఖ ద్వారా శానిటేషన్, పోలీసు శాఖ ద్వారా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎల్‌పిఒ జాన్ విల్టన్, ఎంపీడీవో ఎంవిఆర్ కుమార్ బాబు, సీఐ రవికుమార్, డాక్టర్ సుజిత, డిఇలు అల్లాడి వెంకటేశ్వరరావు. రాజేంద్ర బాబు, శ్రీనివాసరావు, ఎస్‌ఐ మోహన్‌రావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రంపచోడవరం డీఎఫ్‌ఓ నరేంద్రన్ కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్నారు.
చింతూరు : మండలంలోని చట్టి పంచాయతీ వీరాపురం గ్రామంలో గాద రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయంలో ఉదయం నుండి డిఎంహెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్య ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. భద్రాచలం పట్టణానికి చెందిన పసుపులేటి రామకృష్ణ, ఎడ్లపల్లి రామారావు, రెడ్డి సతీష్ కుమార్ సుమారు 5000 మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. చత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న గాదె లింగేశ్వర స్వామి మహాలింగం దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివాసీలు శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ యాదగిరి భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఎపిటిఆర్‌ఎ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ
ప్రజాశక్తి-హుకుంపేట
మహాశివరాత్రి వేడుకను పురస్కరించుకుని ఎపి గిరిజన విలేకరుల సంఘం (ఎపిటిఆర్‌ఎ) ఆధ్వర్యంలో శనివారం వెయ్యి మంది భక్తులకు పులిహౌర పంపిణీ చేశారు. అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలోని మత్స్యగుండం, అడ్డుమండలో ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి వేడుకలకు పాడేరు ఏజెన్సీ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఎపిటిఆర్‌ఎ గత కొన్నేళ్లుగా ఈ వేడుకలకు విచ్చేసిన భక్తులకు పులిహౌర, ప్రసాదం, మంచినీరు ప్యాకెట్లు పంపిణీ చేస్తుంది. ఎపిటిఆర్‌ఎ ఏర్పడిన నాటి నుండి ఆ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా మహాశివరాత్రికి వచ్చే భక్తులకు పులిహౌర పంపిణీ చేపట్టారు. ప్రతి ఏటా జరిగే మహాశివరాత్రి వేడుకల్లో ప్రజలకు సేవలందిస్తున్న ఎపిటిఆర్‌ఎను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఆర్‌ఎ సభ్యులు పి.దేముడుబాబు, సిహెచ్. రమణ, సూర్యారావు, దుర్గా, సునీల్, రాజారావు, జోషి, మహేష్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.










