ప్రజాశక్తి - విజయవాడ అర్బన్
మూడు రోజులపాటు జరిగే గుణదల మేరీమాత ఉత్సవాలు గురువారం ప్రారంభమ య్యాయి. తొలిరోజు యాత్రికులు ఉత్సవాలకు తరలివచ్చారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా ఉత్సవ నిర్వాహకులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. తొలుత ఉత్సవాలను విజయవాడ పీఠాధిపతులు బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుణదల మాత ఆలయ వద్ద నుండి మేరీమాత విగ్రహం వరకు యాత్రికులు పెద్ద సంఖ్యలో వెళ్లడం కనిపించింది. అలాగే కొండ శిఖరాగ్రాన ఉన్న క్రీస్తు శిలువను దర్శిం చుకునేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా మంచినీరు ఏర్పాటుచేయడంతో పాటు యాత్రికులకు సౌకర్యాలు కల్పించినట్లు పుణ్యక్షేత్రం రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు తెలిపారు.
గుణదల మాత ఊరేగింపు : గుణదత మాతగా పేరెన్నిగల మేరీమాత ఊరేగింపు గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ ఊరేగింపును బిషప్ తెలగతోటి రాజారావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రారంభించారు. వైసిపి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.
సమిష్టి దివ్యబలి పూజ : సాయంత్రం ప్రత్యేక ప్రార్థనల అనంతరం సమిష్టి దివ్య పూజాబలి కార్యక్రమం నిర్వహించారు. ఫాదర్ భాలస్వామి, ఫాదర్ పసల తోమస్, ఫాదర్ పోలిశెట్టి జయరాజు, ఫాదర్ తెనాలి తోమస్ తదితరులు పూజా కార్యక్రమాలను నిర్వహిం చారు. అనంతరం ప్రార్థనల్లో పాల్గొన్న వారికి సప్రసాదం అందజేశారు. రాత్రి నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శలు, పాటల ఆలపన అలరించాయి. గుణదల విచారణ కౌన్సిల్ సభ్యులతో గాన కచేరి, కళాదర్శిని ఆధ్వర్యంలో జీవప్రధానం నృత్య రూపకం, గుడివాడకు చెందిన ముత్యాల నాగేశ్వరరావు నిర్వహణలో సిలువధారి నాటకం ఆకట్టుకున్నాయి.










