ప్రజాశక్తి- సింహాచలం: ఆషాడ పౌర్ణమి రోజున చేపట్టే గిరిప్రదక్షిణను ఆదివారం మధ్యాహ్నం దేవస్థానం ప్రచార రథానికి జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్‌వర్మ, వార్డు కార్పొరేటర్ పీవీ నరసింహం, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొని రథాన్ని ప్రారంభించారు. సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి కిలోమీటర్‌కూ భక్తులకు అందుబాటులో మంచినీరు, సేద తీరేందుకు కుర్చీలు, టేబుల్స్ అందుబాటులో ఉంచారు. కొండచుట్టూ 32 కిలోమీటర్లు గిరిప్రదక్షిణలో భాగంగా భక్తుల కోసం సుమారు 200 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు దారిపొడవునా స్వచ్ఛంద సేవా సంస్థలు కాఫీ, ఫలహారాలతో పాటు టిఫిన్, భోజనాలను ఉచితంగా అందించారు. దేవస్థానం వారు ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. గోశాల వద్ద ఆయుష్మాన్‌భవ ఆసుపత్రి ఎమ్‌డి కర్రి అప్పలస్వామి ఆధ్వర్యాన వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి భక్తులకు సేవలందించారు.
తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టే సమయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎక్కువ కౌంటర్లను ఏర్పాటుచేశారు. భక్తులు నడిచే ప్రదేశంలో చెత్త లేకుండా పారిశుధ్య కార్మికుల తమ వంతు సేవలను అందించారు. అప్పుఘర్, జోడుగుళ్లపాలెం తదితత సముద్ర ప్రాంతాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు. తప్పిపోయే భక్తులను వారి బంధువులకు తెలియజేసేందుకు ఎక్కడ అక్కడ ప్రచారం చేసే కౌంటర్లు అందుబాటులో ఉంచారు. ఎండను, సాయంత్రం వర్షాన్ని సైతం లెక్కచేయక భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ ఏడాది భక్తులు సుమారు ఆరేడులక్షల మంది గిరి ప్రదక్షిణలో పాల్గొన్నట్టు ఓ అంచనా. ఈ ఏడాది స్వామి వారి ప్రచార రథం సుమారు నాలుగు గంటల ప్రాంతానికే హనుమంతువాక దాటి వెళ్లడంపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. 32 కిలోమీటర్ల దారి పొడవునా పూర్తిస్థాయిలో వీధిదీపాలు ఏర్పాటు చేయడంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యాత్ర సాగించారు. ఈ ఏడాది ఆదివారం ఉదయం 6 గంటల నుంచే భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొనడం కనిపించింది.










