ప్రజాశక్తి -పిఎం పాలెం : వైజాగ్ వేదికగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఎపిఎల్) సీజన్ - 2 బుధవారం వైభవంగా ప్రారంభమైంది. సినీ హీరోయిన్ శ్రీలీల గౌరవ అతిథిగా హాజరై క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి.శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకు బిసిసిఐ సహకారంతో ఎపిఎల్ సీజన్ - 2 నిర్వహిస్తున్నామని తెలిపారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్రీడాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. సీజన్-1 మంచి ఫలితాలు ఇచ్చిందని, ఇందులోని పలువురు క్రీడాకారులు ఐపిఎల్లో స్థానం దక్కించుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విడిసిఎ అధ్యక్షులు విష్ణు కుమార్‌రాజు, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవివి.సత్యనారాయణ, కలెక్టర్ ఎ.మల్లికార్జున జివిఎంసి మేయర్ జి.హరివెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు.










