ప్రజాశక్తి-సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వార్షిక త్రి కళ్యాణోత్సవానికి సూచికగా మంగళవారం ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా డోలోత్సవం నిర్వహించారు. ఏటా ఫాల్గుణ మాస శుక్లపక్ష పౌర్ణమి రోజున డోలోత్సవం, చూర్ణోత్సవము, వసంతోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. డోలోత్సవాన్ని పురస్కరించుకొని స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి పలు ఆరాధన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పల్లకిలో మెట్ల మార్గం గుండా కొండ దిగువ ఉద్యాన మండపంలోకి తీసుకొచ్చి స్వామి సోదరి అడవివరం గ్రామ దేవత పైడితల్లి అమ్మవారిని తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించమని కోరారు. మొదట అంగీకరించకపోవడంతో స్వామి అలిగి ఉద్యాన మండపానికి చేరగా పెద్దలు అమ్మవారితో చర్చించారు. అమ్మవారు పెళ్లికి అంగీకరించడంతో అర్చక స్వాములు, గ్రామస్తులు, అధికారులు ఒకరిపై ఒకరు వసంతాలు జల్లుకొని చూర్ణోత్సవాన్ని, బెల్లం పాకాన్ని, వడపప్పు బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించారు. అనంతరం స్వామి వారు గ్రామ తిరువీధుల గుండా వెళ్లి భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం మెట్ల మార్గం గుండా కొండపైకి చేరుకోవడంతో ఈ ఉత్సవం ముగిసింది. ఈ ఉత్సవాన్ని గ్రామస్తులు బొట్టునడుపు పున్నమిగా వ్యవహరిస్తారు. ఈ ఉత్సవంలో ప్రధానార్చకులు గోడవర్తి శ్రీనివాస్, రమణమూర్తి, గోపాల్, ఇతర అర్చక సిబ్బంది, దేవస్థానం ఎఇఒలు ఆనంద్ కుమార్, శ్రీనివాసరావు, ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు ట్రస్టు బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్‌రాజు తదితరులు పాల్గొన్నారు.