ప్రజాశక్తి-పద్మనాభం : పద్మనాభంలోని అనంత పద్మనాభస్వామి తెప్పోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. 60సంవత్సరాల తర్వాత స్వామి వారి తెప్సోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తిచేశారు. ఈ ఎడాది వార్షిక కల్యాణోత్సవంలో భాగంగా దేవాదాయ-దర్మాదాయ శాఖ ఆధ్వర్యాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెప్పోత్సవ కార్యక్రమాన్ని శ్రీదుర్గా మహాపీఠాదిపతి శ్రవణచైతన్యానంద చిన్నస్వామి ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభించారు. అనంతపద్మనాభ స్వామి ప్రాంగణంలో ఉన్న కుంతీమాధవస్వామి అలయంలో ఉన్న ఉత్సవ విగ్రహలను పల్లకిలో పెట్టి ప్రధాన అర్చకులు సీతారామాంజనేయులు మంత్రోచ్ఛరణల మద్య మంగళ వాయిద్యాలతో గాలి గోపురం నుంచి ఊరేగింపు చేశారు. శ్రీదేవిభూదేవి సమేతుడైన అనంతపద్మనాభస్వామి గాలి గోపురానికి తూర్పు దిశగా ఆర్ అండ్ బి రోడ్డులో పోలీస్ స్టేషన్ మీదుగా పద్మనాభం జంక్షన్‌కు ఊరేగింపు చేరుకుంది. కన్నయ్య కోనేరులో సిద్ధంగా ఉంచిన హంస వాహనంలో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు ముందుగానే కన్నయ్య కోనేరుకు చేరుకున్నారు.
ఏర్పాట్లు ఇలా...
అనంతపద్మనాభస్వామి కొండకు దిగువన ఉన్న కుంతీమాధవస్వామి అలయం నుంచి రోడ్డుకిరువైపులా విద్యుత్ దీపాలంకరణ చేశారు. కన్నయ్య కోనేరుకు చుట్టూ గట్టు వేశారు. కోనేరులో నీరు లేక పోవడంతో నాలుగు మోటార్లతో నాలుగు రోజు పాటు నీటిని నింపారు. కోనేరు చుట్టూ విద్యుత్ లైట్లు ఏర్పాటుచేశారు. హంసవాహనాన్ని పూల మాలలతో అలంకరించారు. విజయనగరం జిల్లా చింతవలస గ్రామంలోని శ్రీవెంటేశ్వర అలయానికి చెందిన హంస వాహనాన్ని రప్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కంటుబోతు రాంబాబు, ఆలయ ఇఒ ఎస్.నానాజీబాబు, సర్పంచ్ తాలాడ పాప, ఎంపిటిసి సభ్యులు కంటుబోతు లక్ష్మ తదితరులు పాల్గొన్నారు.