వాతావరణం మార్పులతో వరి రైతుల్లో ఆందోళన
ముమ్మరంగా ఖరీఫ్ మాసూళ్లు
ప్రస్తుతం వర్షాలు కురిస్తే రైతులకు తీవ్ర నష్టమే
తేమశాతం సడలించి ధాన్యం కొంటేనే రైతులకు ఉపశమనం
కరువు కారణంగా మెట్టలో వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంట
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ఖరీఫ్ పంట చేతికొచ్చే సమయంలో వాయుగుండం హెచ్చరికలతో రెండు జిల్లాల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షం కురిస్తే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో గాలులు, వర్షాలు కురవనున్నట్లు ప్రకటించింది. దీంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండాపోయింది. ఖరీఫ్‌లో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షలకుపైగా ఎకరాల్లో వరి సాగు చేశారు. వర్షాకాలం నాలుగు నెలల్లో మూడు నెలలు వర్షపాతం లోటు ఏర్పడింది. దీంతో మెట్ట ప్రాంతంలోని చింతలపూడి, బుట్టాయగూడెం, కామవరపుకోట, చాట్రాయి వంటి మండలాల్లో 12 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఖరీఫ్ పంట దెబ్బతింది. దీంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. ప్రభుత్వం కరువు మండలాలుగా కూడా ప్రకటించలేదు. దీంతో పంటలు దెబ్బతిన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో డెల్టా రైతాంగం సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నో కష్టాలకోర్చి పంటను కాపాడుకున్నారు. తీరా పంట చేతికొచ్చే తరుణంలో వాయుగుండం హెచ్చరికలు రైతులను నిలువెల్లా వణికిస్తున్నాయి. రెండు జిల్లాల్లో ఖరీఫ్ మాసూళ్లు ప్రారంభమయ్యాయి. ఏలూరు జిల్లాలో ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, పెదపాడు వంటి మండలాల్లో ఖరీఫ్ కోతలు పెద్దఎత్తున సాగుతున్నాయి. పశ్చిమలో తాడేపల్లిగూడెం వంటి పలు మండలాల్లో రైతులు ఖరీఫ్ మాసూళ్లు చేస్తున్నారు. కోత యంత్రాలతో మాసూళ్లు చేయడంతో ధాన్యం ఆరబెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అల్పపీడన ప్రభావంతో గడిచిన రెండు, మూడు రోజులుగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమై చలిగాలులు ఎక్కువగా వీస్తున్నాయి. పట్టపగలు సైతం చీకట్లు కమ్ముకున్నట్లు ఉంటుంది. దీంతో కోత కోసి ధాన్యం ఆరబెట్టే పరిస్థితి లేకుండాపోయింది. 17 శాతం తేమ ఉంటేనే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో రైతులు అయినకాడికి దళారులకు అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేలకుపైగా రైతులు పెట్టుబడులు పెట్టారు. ఖరీఫ్‌లో పంట బాగా పండిందని, దిగుబడి ఆశాజనకంగా వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ తరుణంలో వాయుగుండం హెచ్చరికలతో రైతులకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వర్షాలు కురిస్తే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. తేమ నిబంధనలు సడలించి వేగంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం అటువైపు ఏమాత్రం ఆలోచించని పరిస్థితి ఉంది. దీంతో కోత కోయాలా, వద్దా అనే డైలమాలో రైతులు నలిగిపోతున్నారు. కోత కోయకపోతే గాలులకు నేలకొరిగి ఇంకా ఎక్కువ నష్టం వస్తుందని అన్నదాత భయపడుతున్నాడు. కోత కోస్తే ధాన్యం ఆరబెట్టే పరిస్థితి లేదని ఆవేదనకు గురవుతున్నాడు. గత రబీ సీజన్‌లో వర్షాలు పడటంతో జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధాన్యం విక్రయించేందుకు నానా యాతన పడ్డారు. వాయుగుండం ప్రభావం నుంచి రైతులు గట్టెక్కుతారో లేదో చూడాల్సి ఉంది.