పంట కాపాడుకునేందుకు రైతన్న ఉరుకులుపరుగులు
ప్రజాశక్తి - ముదినేపలి
వాతావరణ మార్పులతో రైతులు వణికిపోతున్నారు. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో వరి రైతులు కలవరపడుతున్నారు. సోమవారం తెల్లవారుజూము నుంచి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడటంతో రైతులు బెంబేలెత్తారు. మండలవ్యాప్తంగా పంట చేతికి వచ్చి రైతులు రేపోమారో కోతలు కోసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో వాతావరణంలో మార్పులు వచ్చి వాయుగుండగా మారడంతో రైతులు పంటను ఏలా కాపాడుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పంటపై లక్షలాది రూపాయాలు పెట్టుబడులు పెట్టామని రైతులు వాపోతున్నారు. ప్రతిఏటా నవంబర్‌లో పంటలు చేతికందే దశలో తుపాన్లు వచ్చి పంటను తుడిసిపెట్టుకుపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మండలంలోని పలు గ్రామాల్లో స్వర్ణ వరి వంగడం కోతలు కోసి పనలపై ఉంది. మరికొన్ని గ్రామాల్లో పంట కోతకు సిద్దంగా ఉంది. ఈ దశలో పంటను కాపాడుకునేందుకు రైతులు నానాతంటాలు పడుతున్నారు. ఈ తరుణంలో వర్షం పడితే పనపై ఉన్న పంట తడిసి రంగుమారి మొలకొతే ప్రమాదం ఉంటుందని హైరానా పడుతున్నారు. ఈదురు గాలులకు పైరు నేలవాలి కంకులు తడిసిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకునే పన్నుల్లో మండల రైతులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.










