Feb 24,2023 23:47

వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న డాక్టర్‌ మురళీమోహన్‌

ప్రజాశక్తి- విశాఖపట్నం :'వాయు కాలుష్యం, మానవ ఆరోగ్యం' అనే అంశంపై ఎపి కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. నగరంలోని మేఘాలయ హోటల్‌లో నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాంలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్‌పై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కోశాధికారి డాక్టర్‌ మురళీమోహన్‌ పాల్గొని, వివిధ రకాల కాలుష్య కారకాలు, కళ్లు, ముక్కు, గొంతు, శ్వాసకోశ వ్యవస్థకు చికాకు వివరించారు. సల్ఫర్‌డయాక్సైడ్‌ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నొప్పి కలిగిస్తాయన్నారు. చెత్తను కాల్పడం, పొగతాగడం, ప్రజారవాణాలో వెలువడిన కాలుష్యం, ప్రతి చిన్న అవసరానికి మోటారు వాహన వినియోగం వంటి చర్యలతో కాలుష్యం పెరిగి శారీరక రుగ్మతలు ఉత్పన్నమౌతాయన్నారు.
కార్యక్రమంలో జివిఎంసి అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు, కాలుష్య నియంత్రణ మండలి ఇఇ ఎస్‌.వెంకటేశ్వర్లు, ఎపి పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు జెడ్‌ఒ ఎం.నాగార్జున, కృష్ణా యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.రామకృష్ణారావు, రవాణా పోలీసు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.