
ప్రజాశక్తి - భట్టిప్రోలు
సాధారణంగా పంచాయతీలో విపత్తులు, వరదలు వంటి పలు రకాల అత్యవసర సమయాలలో పాలకవర్గ అత్యవసర సమావేశాలు జరుగుతూ ఉంటాయి. కానీ భట్టిప్రోలులో అందుకు భిన్నంగా కొన్ని రకాల బిల్లు మార్చుకునేందుకు మంగళవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాలకవర్గ సభ్యులకు సమావేశ పత్రాలను సోమవారం అందజేశారు. ఎజెండాలోని అంశాలు ఇష్టపడని కొందరు పాలకవర్గ సభ్యులు సమావేశానికి రాకపోవడంతో సమావేశం నిలిచిపోయింది. 2022-23ఏడాదికి పంచాయతీలో వినియోగించిన బ్లీచింగ్, సున్నంను సరఫరా చేసిన శాన్వి ఎంటర్ప్రైజెస్‌కు ఇవ్వవలసిన బిల్లులను మంజూరు చేసేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన సాధారణ సమావేశంలోనే ఈ బిల్లును ప్రవేశపెట్టగా తగిన రసీదులు, రికార్డులు లేకపోవడంతో అప్పట్లో సభ్యులు తిరస్కరించారు. మరల తిరిగి దీనికి సంబంధించిన ఏజెంటు రసీదులు, రికార్డులు సమకూర్చుకొని తనకు బిల్లు అందించాలని కోరడంతో సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో ఇదే సంస్థ బిల్లులు లేకుండా సొమ్ము చేసుకున్న సందర్భాలు ఉండటంతో ప్రస్తుతం చూపిస్తున్న బిల్లులు, రికార్డులు సరైనవి కావని, ఎప్పుడో సరఫరా చేసినట్లుగా చూపిస్తున్న వాటికి నేడేవిధంగా బిల్లులు చెల్లిస్తారంటూ కొందరు పాలకవర్గ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. బ్లీచింగ్, సున్నం సరఫరాలో అవకతవకులు జరిగాయని ఆరోపిస్తున్నారు. దీనిని పరిశీలించి, విచారించాలని కొందరు పాలకవర్గ సభ్యులు ఆధారాలతో కలెక్టర్‌కు పిర్యాదు చేశారు. శాన్వి ఎంటర్ప్రైజెస్‌కు రు.5.88లక్షలు చెల్లించాల్సి ఉండగా దీనికి జిఎస్టితో కలిపి రూ.14లక్షలకు తీర్మానించేందుకు సమావేశం ఏర్పాటు చేయడం పట్ల పాలకవర్గ సభ్యులందరూ వ్యతిరేకించినట్లు సమాచారం.
మూడేళ్లుగా స్వీపర్లకు అందని అలవెన్సులు
పంచాయతీలో పనిచేస్తున్న 32మంది పారిశుద్ధ్య కార్మికులకు గత మూడేళ్లుగా అందాల్సిన అలవెన్సులు నేటికీ అందించలేదు. దీనిపట్ల పలువురు విస్మయ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెల కొబ్బరి నూనె, సబ్బులు, శానిటైజర్, మాస్కులు వంటి వస్తువులతో పాటు యూనిఫామ్ కూడా అందించాల్సి ఉంది. కానీ ప్రస్తుత పాలకవర్గం అధికారం చేపట్టిన మొదట్లో ఒకసారి మాత్రమే వీటిని సమకూర్చి తర్వాత వదిలేశారు. అదే మన అడిగితే అదుగో ఇస్తాం అటు కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతరం మురుగు కూపంలో పనిచేసి ఇంటికి వెళ్లి భోజనం చేయాలంటే ఎంత కడిగినా చేతులు దుర్వాసన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి అదనంగా తామే స్వయంగా సబ్బులు, సరుకులు కొనుక్కొంటున్నట్లు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు అందాల్సిన యూనిఫామ్ తో పాటు వివిధ రకాల అలవెన్సులు తక్షణమే అందజేయాలని కోరుచున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు అందాల్సినవి ఈనెల వేతనంతో పాటు అందించేందుకు తీర్మానించినట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో వీటిని సరఫరా చేస్తామని అన్నారు. కోరం లేక సమావేశం నిలిచినట్లు తెలిపారు.