వాట్సాప్‌లో కొత్త ఫీచర్ 'డిసప్పియరింగ్ మెసేజ్'.. ఏడు రోజుల తర్వాత సందేశాలు కనుమరుగైపోతాయి.
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ 'మాయమైపోయే మెసేజ్' ఆప్షన్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ఆప్షన్ ఎంచుకుంటే ఒకరికి ఒకరు పంపించుకునే సందేశాలు ఏడు రోజుల తర్వాత వాటంతటవే కనుమరుగైపోతాయి.
అంటే ఏడురోజులకి ముందు వచ్చిన మెసేజులన్నీ డిలీట్ అయిపోతాయి. ఫేస్‌బుక్ యాజమాన్యం కింద ఉన్న వాట్సాప్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా రెండొందల కోట్ల మంది వినియోగిస్తున్నారు.
చాట్‌లను వ్యక్తిగతంగా, గోప్యంగా ఉంచుకునేందుకు ఈ ఆప్షన్ సహకరిస్తుందని వాట్సాప్ చెబుతోంది.
ఏవైనా సందేశాలు, ఫొటోలు, వీడియోలను దాచి ఉంచుకోవాలంటే వాటిని వెంటనే సేవ్ చేసుకోవాలి. లేదా ఫార్వర్డ్ చేసుకోవాలి. స్క్రీన్‌షాట్ తీసుకుని కూడా దాచుకోవచ్చు.
'డిసప్పియరింగ్ మెసేజ్' ఆప్షన్ నవంబర్ నెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తుంది.
'ఈ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా వినియోగదారులకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. చాట్ చేసినవేవీ శాశ్వతంగా ఉండవు అనే నిశ్చింత లభిస్తుంది. అలాగే చాటింగ్ విషయంలో అప్రమత్తంగా ఉంటారు. ఏం మాట్లాడుతున్నాం, ఏం పంపిస్తున్నాం అనేవి జాగ్రత్తగా గుర్తు పెట్టుకుంటారు' అంటూ వాట్సాప్ సంస్థ ఈ కొత్త ఆప్షన్ ప్రయోజనాలను ఒక బ్లాగులో వివరించింది.
సోషల్ మీడియాలో మరింత గోపత్యకు అవకాశం ఉండేలా మార్పులు తీసుకొస్తామని 2019 ఏప్రిల్‌లో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ హామీ ఇచ్చారు.
సోషల్ మీడియాలో కంటెంట్ కొద్దిరోజులు మాత్రమే కనిపించేలా చూడడం కూడా ఈ దిశగా జుకర్‌బర్గ్ చేసిన ప్రతిపాదనల్లో ఒకటి. అందులో భాగంగానే 'డిసప్పియరింగ్ మెసేజ్' ఆప్షన్ తీసుకువచ్చారు.
ఈ సంస్థ తన మెసేజింగ్ ప్లాట్‌ఫాంలైన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్‌లను ఏకీకృతం చేసే ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా ఏ ప్లాట్‌ఫాం నుంచైనా మరొక ఫ్లాట్‌ఫాంకు సందేశాలు పంపే వీలు కలుగుతుంది. అంటే వాట్సాప్ నుంచి ఫేస్‌బుక్ మెసెంజర్‌కు నేరుగా సందేశాలు పంపవచ్చు.
వాట్సాప్ పోటీదారు 'స్నాప్‌చాట్'లో డిసప్పియరింగ్ మెసేజ్ ఆప్షన్ ముందునుంచే ఉంది.