Sep 30,2023 23:03

ప్రజాశక్తి - హెల్త్‌ యూనివర్సిటీ : నగర వాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఏర్పాటుచేసిన అండర్‌ వాటర్‌ ఫిష్‌ టన్నెల్‌ ఎగ్జిబిషన్‌ను సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు దుబారు, మలేషియా, సింగపూర్‌ ప్రాంతాలకే పరిమితమైన అండర్‌ వాటర్‌ టన్నెల్‌ ఫిష్‌ ఎగ్జిబిషన్‌ను ఇప్పుడు విజయవాడ నగరం నడిబొడ్డున సందర్శకుల కోసం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. చుట్టుగుంట శాతవాహన కాలేజీ గ్రౌండ్స్‌లో అండర్‌ వాటర్‌ టన్నెల్‌ ఫిష్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్‌ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు విచ్చేసి ఎగ్జిబిషన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటలు, ఆహ్లాదానికి అందరూ దూరం అవుతున్న వేళ విజయవాడ నగరంలో కొత్త ప్రపంచం ఆవిష్కతమైందన్నారు. అండర్‌ టన్నెల్‌ వాటర్‌లో రకరకాల చేపలు వున్నాయని ఈ చేపలు కనువిందు చేస్తున్నాయని చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని ఈ ఎగ్జిబిషన్‌ అలరిస్తుందని చెప్పారు. జెయింట్‌ వీల్‌, కొలంబస్‌, టోరాటోరా, బ్రేక్‌ డ్యాన్స్‌, చిన్న పిల్లల ఆటవస్తువులు ఈ ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇటు చిన్నారులు, అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటూ ఆనందాన్ని పంచుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. నగర వాసులు తప్పక ఎగ్జిబిషన్‌ను సందర్శించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ కుక్కల అనిత, అడపా ప్రభాకర్‌ పాల్గొన్నారు.