
ప్రజాశక్తి - చిలకలూరిపేట : పాఠాలు చెపాల్సిన ఉపాధ్యాయులు తమను హింసలు పెడుతున్నారని, భరించలేని విధంగా దెబ్బలు కొట్టడంతోపాటు వారిళ్లల్లో పనులు చేయించుకుంటున్నారని మండలంలోని రాజాపేట ఏపీ మోడల్ గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బాధలను తట్టుకోలేని వారు తమ దుస్థితిని జిల్లా కలెక్టర్‌కు విన్నవించడానికి సోమవారం ఉదయం పల్నాడు జిల్లా కేంద్రానికి వెళ్తుండగా తెలుసుకున్న పోలీసులు, అధికారులు విద్యార్థులతో మాట్లాడి కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. దీనిపై విచారణకు కలెక్టర్ ఆదేశించారు. వివరాల ప్రకారం. .. గురుకుల పాఠశాలకు చెందిన 50 మంది వరకు విద్యార్థులు సోమవారం ఉదయం నడుకుంటూ 25 కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేటలకు బయలుదేరారు. ఇది తెలిసిన ఎఐఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు వారి వద్దకు వెళ్లి విషయాన్ని రూరల్ ఎస్‌ఐ రాజేష్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన హుటాహుటిన బయలుదేరి విద్యార్థులను 11 గంటలకు పాఠశాలకు 10 కిలోమీటర్ల దూరంలోని మద్దిరాల గ్రామం దాటిన తరవాత కలుసుకున్నారు. సమస్య ఏమిటని వారిని అడగడంతో ఒక్కొక్కరుగా విద్యార్థులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పిఇటి బండ్ల అశోక్‌తోపాటు హెచ్‌ఎం తమను నాలుగు నెలలుగా వేధిస్తున్నారని, నిత్యం ఏదో ఒక వంకతో కొడుతున్నారని, తిడుతున్నారని చెప్పారు. కొంతమందిని దుస్తులు లేకుండా చేసి వాతలు పడేలా కొట్టారని తెలిపారు. తమను వారిళ్లల్లో పనిమనుషుల్లా చూస్తున్నారని, చదువు కూడా సరిగా చెప్పడం లేదని అన్నారు. పురుగుల అన్నం పెడుతున్నారని, దుప్పట్లు కూడా సరిగా లేవని, తాగునీరు రావడం లేదని అనేక సమస్యలను వివరించారు. వీటన్నింటినీ ఎవరికి చెప్పుకోవాలో తెలీక చివరికి కలెక్టర్‌ను కలుద్దామనుకున్నామని, అందుకే నడిచి వెళ్తున్నామని వివరించారు. తహశీల్దార్ జి.సుజాత, ఎంపిడిఒ శ్రీనివాసరావు, ఎంఇఒ కె.లకీë సైతం విద్యార్థుల వద్దకు వచ్చి మాట్లాడారు. అనంతరం వారిని పాఠశాలకు తీసుకెళ్లి మరిన్ని వివరాలు సేకరించారు. ఈ సమాచారం తెలసుకున్న పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ విద్యార్థులను తన వద్దకు పిలిపించుకున్నారు. వారితో మాట్లాడిన అనంతరం పాఠశాలలో పరిస్థితులపై విచారణకు అధికారులను ఆదేశించారు.