Aug 05,2021 11:23

మంగళగిరి : వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జగనన్న పచ్చతోరణం, వన మహౌత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో సిఎం జగన్‌ మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వన మహౌత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల చెట్లను నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ చేపట్టిందని తెలిపారు. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ.. తద్వారా ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తోడ్పడాలని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఏటా వర్షా కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహిస్తుందని తెలిపారు.