ప్రజాశక్తి-ఆలూరు
చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు చేదోడుగా ఉపాధి కల్పించాల్సిన అధికార పార్టీ నాయకులు, వాటాల కోసం ఆలూరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ తెర్నేకల్ వెంకప్ప విమర్శించారు. శుక్రవారం ఆలూరులోని సంతమార్కెట్, మండల పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ ఆవరణలో వాటర్ స్కీం ఎదురుగా మండల నాయకులు ఛత్రపతి రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకప్ప మాట్లాడారు. రెండేళ్ల క్రితమే రూఅర్బన్ నిధులు రూ.1.20 కోట్లతో సంతమార్కెట్‌లోని 27 దుకాణాలు, ఎంపిడిఒ కార్యాలయం ముందు రూ.80 లక్షలతో 18 దుకాణాలతో నిర్మించిన కాంప్లెక్స్‌ను వాటాల కోసం పాలకులు ప్రారంభించకుండా పంచాయతీకి, మండల అభివృద్ధికి నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాల్సిన రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం వాటాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. గతంలో అనేకసార్లు జనసేన పార్టీగా సంబంధిత అధికారులకు వినతిపత్రం అందించినా ప్రయోజనం లేకపోయిందని, నేడు రిలే నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. పాలకులు, అధికారులు స్పందించకుంటే జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు, నిరుద్యోగులకు దుకాణాలను ఇస్తామని హెచ్చరించారు. హనుమంతు, హమీద్, పవన్, సిద్ధలింగా, వీరేష్, కృష్ణ, గంగాధర్, చంద్ర, నాగరాజు, ఉదరు పాల్గొన్నారు.
రిలే దీక్షలో పాల్గొన్న తెర్నేకల్ వెంకప్ప










