ప్రజాశక్తి - విశాఖపట్నం
వాస్తవాలను ప్రతిబి ంబించే పత్రిక ప్రజాశక్తి అని మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. నగరంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో శనివారం సాయంత్రం ప్రజాశక్తి దినపత్రిక 42వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల సమస్యలపై నిరంతరం వార్తలు, వ్యాసాలు రాస్తూ, ప్రజల ఆదరణకు నోచుకుంటున్న ప్రజాశక్తి మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన బాల వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాశరావు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాస్తున్న ప్రజాశక్తి దినపత్రిక తన ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తుండడం అభినంద నీయమన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కెఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమల పరిరక్షణలో ప్రజాశక్తి దినపత్రిక పోషిస్తున్న పాత్ర ఎంతో గొప్పదని స్పష్టం చేశారు. ప్రజాశక్తి విశాఖ బ్రాంచి మేనేజర్ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య నాటిన విత్తనమైన ప్రజాశక్తి నేడు మహా వృక్షమై, ప్రజల ఆదరాభిమానాలతో 42వ వసంతంలోకి అడుగుపెడుతోందని అన్నారు. పత్రిక విస్తరణ, అభివృద్ధిలో యావత్తు ప్రజాశక్తి యంత్రాంగం, సిబ్బంది కృషి ఎనలేనిదన్నారు. ప్రజాశక్తి విశాఖ బ్యూరో చీఫ్ ఎన్.మధు సూదనరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో వైసిపి నాయకులు గొలగాని శ్రీనివాస్ తన ప్రసంగంలో ప్రజాశక్తి దినపత్రిక ప్రాధాన్యతను వివరించారు. సిబ్బంది నిబద్ధతను కొనియాడారు. ప్రజాశక్తి ఎడివిటి ఇన్‌ఛార్జి ఎస్.రాజేష్ రెడ్డి వందన సమర్పణతో ఉత్సాహపూరిత వాతావరణంలో సభ ముగిసింది. పత్రిక సీనియర్ ఏజెంట్ అరుణ్ జీ, సిబ్బంది పాల్గొన్నారు.










