Jul 25,2023 00:44
మాట్లాడుతున్న ఎడిఎ శ్రీనివాస్‌

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: రైతు భరోసా కేంద్రం సిబ్బంది పైరు నమోదు చేసే సమయంలో వాస్తవ సాగును గుర్తించి పైరు నమోదు చేయాలని మార్టూరు సహాయ వ్యవసాయ సంచాలకులు కెవి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం మార్టూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని సంతమాగులూరు, బల్లికురవ, జె పంగులూరు, మార్టూరు మండలాల పరిధిలోని రైతు భరోసా సిబ్బంది, వ్యవసాయాధికారులు, ఏఎస్‌ఓలకు స్థానిక కొణిదెన రోడ్డులోని వ్యవసాయశాఖ కార్యాలయంలో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎడిఎ మాట్లాడుతూ.. పైరు నమోదు ఆధారంగానే రైతులకు ప్రభుత్వం అన్ని పథకాల్ని అందిస్తోందని, ఇన్సూరెన్స్‌, పంట నష్టం, ప్రభుత్వం ద్వారా పంట కొనుగోలు వంటి పథకాలన్నీ పైరు నమోదు ఆధారంగానే అమలు చేస్తారని, రైతు భరోసా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం మార్టూరు వ్యవసాయాధికారి వీరగంధం కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు జరుగుతున్నందున రైతు భరోసా కేంద్రం సిబ్బంది కౌలు రైతులను గుర్తించి అందరికీ సకాలంలో కౌలు రైతుల కార్డులను రెవెన్యూ శాఖ ద్వారా మంజూరు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారులు లావణ్య, కుమారి, ఉద్యానశాఖాధికారి హనుమంత నాయక్‌, రైతు భరోసా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.