ప్రజాశక్తి - కోసిగి
వాస్తవ సాగుదారులకే భూహక్కులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.వెంకటేశులు డిమాండ్ చేశారు. గత 20 ఏళ్లుగా చిన్నారెడ్డి, శాంతమ్మ సాగు చేసుకుంటున్న కోసిగిలోని సర్వే నెంబర్ 425లో ఎకరా 30 సెంట్ల ప్రభుత్వ భూమిని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరుపేద వ్యవసాయ కూలీ చిన్నారెడ్డి 20 ఏళ్ల క్రితం ముళ్ల చెట్లతో నిండి ఉన్న ప్రభుత్వ భూమిని వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చదును చేసి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రతేడాది మాదిరిగానే ఈఏడాది కూడా వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పత్తి పంట సాగు చేశారని చెప్పారు. ఈ మధ్యలోనే రీసర్వే అధికారులు పొలాలపై రీసర్వేకు వచ్చారని, ఈ పొలం వారం ఈరన్న, వారం అంజనమ్మ పేర్లపై నమోదయిందని తెలిపారని అన్నారు. ఈ పేరు గల వ్యక్తి కోసిగిలో ఎవరూ లేరని, తుమ్మిగనూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ కార్యకర్త అని చెప్పారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విచారకరమని తెలిపారు. రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుని సాగులో లేని వారి పేర్లను తొలగించి వాస్తవ సాగుదారుడైన చిన్నారెడ్డికి భూహక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు. బొంపల్లి గ్రామంలో ఇదే పరిస్థితి ఉందన్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని తెలిపారు. సిపిఎం మండల కన్వీనర్ రాముడు, నాయకులు వీరేష్, బాధిత రైతు చిన్నారెడ్డి పాల్గొన్నారు.