Feb 03,2022 06:12
  • రిటైల్‌ ద్రవోల్బణానికి సంబంధించి అంచనాలను ఆర్థిక సర్వే ప్రకటించకుండానే ద్రవ్యోల్బణం అదుపులో ఉందనటం హాస్యాస్పదం. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పి, వాటిపై మార్కెట్‌ శక్తుల అజమాయిషీ పెరిగి, నియంత్రణ లేని ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఇబ్బందులకు గరవుతున్నారు. అయితే నిత్యావసర, అత్యవసర వస్తువుల ధరలను సమర్థవంతంగా అదుపు చేశామని ఆర్థిక సర్వే పేర్కొనటం పార్లమెంట్‌ను అధికారికంగా పక్కదారి పట్టించటమే.


'ఆర్థిక సర్వే' దేశ వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించలేదు. ఈ సర్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 9.2 శాతంగా పేర్కొంది. 2022ా23 సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి 8 శాతం నుంచి 8.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 31 డిసెంబర్‌ 2021 నాటికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు 633.6 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరాయని ఉటంకించింది. ప్రభుత్వ ఆదాయంలో పెద్ద ఎత్తున వృద్ధి నమోదయిందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో, ఉపాధి అవకాశాలు కరోనా పరిస్థితులకు ముందున్న స్థాయికి చేరతాయని విశ్లేషించింది. ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం ఏప్రియల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య కాలంలో 2.9 శాతంగా అతి స్వల్ప స్థాయిలో నమోదయిందని పేర్కొంది. అత్యవసర, నిత్యావసర వస్తుత్పత్తుల సరఫరాని సమర్థవంతంగా నిర్వహించటం వలన వీటి ధరలు అదుపులో ఉన్నాయని సెలవిచ్చింది.
పైన పేర్కొన్న ఆర్థిక సర్వేలోని అంశాలు, దేశ ఆర్థిక పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉన్నాయన్నది వాస్తవం. నిజ జీవితంలో దేశవ్యాప్తంగా ప్రజానీకం పడుతున్న కష్టాలు, ఇబ్బందులను ఏమాత్రం సమీక్షించని ఆర్థిక సర్వే, అర్థ సత్యాలతో, అబద్ధాలతో అక్షర బద్దం చేయబడింది. రేఖామాత్రంగా కొన్ని కీలక అంశాలను విశ్లేషిస్తేనే ఆర్థిక సర్వే లోని డొల్లతనం బహిర్గతమవుతోంది.
2019ా20లో వాస్తవ జిడిపి వృద్ధిరేటు 4.1 శాతం మాత్రమే. 2020ా21లో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఘోరంగా మైనస్‌ 7.3 శాతానికి పడిపోయింది. గత బడ్జెట్‌లో భారతదేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందనున్నదని ప్రగల్భాలు పలికి, వృద్ధి అంచనాలను వాస్తవ విరుద్ధంగా ప్రకటించి, అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తిరిగి లక్ష్యాలను తగ్గించుకున్న పరిస్థితిని విస్మరించలేము.
విదేశీ మారక ద్రవ్య నిల్వలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవాహం పెరిగిందని పేర్కొన్న సర్వే దిగజారుతున్న రూపాయి విలువ వలన ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న ప్రమాదాన్ని అంచనా వెయ్యకపోవటం ఉద్దేశపూర్వకమే. ఈ విదేశీ మారక ద్రవ్యం కొనుగోలు శక్తికి, ఉపాధికి ఊతం ఇచ్చే ఉత్పాదక రంగానికి సంబంధించిన పరిశ్రమలలో కాకుండా, ఆర్థిక రంగం, సేవల రంగం, సాఫ్ట్‌వేర్‌ రంగం వంటి రంగాలలోకి ప్రవేశించటం ఆర్థిక సార్వభౌమత్వానికి శ్రేయస్కరం కాదు. దీనిని ఏ క్షణమైనా ఎగిరిపోయే బట్లర్‌ఫ్లై క్యాపిటల్‌గానే భావించవలసి ఉంటుంది.
ఉపాధి అవకాశాలు కరోనా ముందు స్థాయికి వస్తాయని సర్వే ప్రస్తుతించినా, ప్రస్తుత పరిస్థితులలో నిరుద్యోగ యువతకు ప్రయోజనం లేదన్నది సుస్పష్టం. నోట్ల రద్దు, జిఎస్‌టి, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్‌ాఔట్‌సోర్సింగ్‌ విధానాల అమలు నేపథ్యంలో కరోనాకు ముందే దేశంలో నిరుద్యోగిత తారాస్థాయికి చేరడమే దీనికి కారణం.
ఐపిఓల ద్వారా 75 కంపెనీలు 89,066 కోట్లు సమీకరించి దశాబ్దకాలంలో ఒక్క ఏడాదిలో అత్యధిక నిధుల సమీకరణ జరిగినదని ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. నియంత్రణలేని స్టాక్‌ మార్కెట్‌లో వ్యక్తిగత మదుపుదారుల సంపద ఆవిరవుతున్న సంక్షోభ పరిస్థితిని అధ్యయనం చేయవలసిన బాధ్యతను విస్మరించారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ రంగానికి సంబంధించిన వ్యాప్తి జిడిపిలో 3.2 శాతంగా ఉందని, ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు సమానమని సర్వే పేర్కొన్న నేపథ్యంలో ఎల్‌ఐసిలో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ ద్వారా లక్ష కోట్లను సమీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవడం వివేకం.
రిటైల్‌ ద్రవోల్బణానికి సంబంధించి అంచనాలను ఆర్థిక సర్వే ప్రకటించకుండానే ద్రవ్యోల్బణం అదుపులో ఉందనటం హాస్యాస్పదం. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పి, వాటిపై మార్కెట్‌ శక్తుల అజమాయిషీ పెరిగి, నియంత్రణ లేని ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఇబ్బందులకు గరవుతున్నారు. అయితే నిత్యావసర, అత్యవసర వస్తువుల ధరలను సమర్థవంతంగా అదుపు చేశామని ఆర్థిక సర్వే పేర్కొనటం పార్లమెంట్‌ను అధికారికంగా పక్కదారి పట్టించటమే.
అంతర్జాతీయంగా ముడిచమురు బ్యారెల్‌ ధరలు తగ్గినప్పటికీ, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ వంటి చమురు ఉత్పత్తుల ధరలు తగ్గించకపోవటం, వాటిపై పెద్ద ఎత్తున పన్నులు విధించటంతో ఇది ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయినది. ప్రజల పొదుపుతో సహా వివిధ రకాల నిత్యావసర వస్తూత్పత్తులు, అత్యవసర సేవలపై 'ఒకే దేశం-ఒకే పన్ను' పేరుతో జిఎస్‌టి ని మోపటం వలన కేవలం 2021 ఏప్రిల్‌ నుండి నవంబర్‌ వరకు 10.74 లక్షల కోట్లు జిఎస్‌టి రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరాయి. రిజర్వ్‌ బ్యాంకు నుంచి పెద్ద ఎత్తున మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం వంటి వివిధ కారణాల వలన కూడా ప్రభుత్వ ఆదాయంలో పెద్ద ఎత్తున వృద్ధి నమోదవటం గమనార్హం. కానీ ఈ పన్నుల లబ్ధి ఫలాలు ప్రజా ప్రయోజనాలకు బదలీ కాకపోవడమే చర్చనీయాంశం.


/ వ్యాసకర్త : జి కిషోర్ కుమార్,

ప్రధాన కార్యదర్శి - ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌- మచిలీపట్నం డివిజన్‌, సెల్‌ : 9440905501 /