ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : జివిఎంసిలో పారిశుధ్య పనులు చేస్తూ చనిపోయిన, 60 ఏళ్లు పూర్తయిన, లాంగ్ ఆబ్సెంట్ అయిన కార్మికుల వారసులను జివిఎంసిలో కొత్తగా నియామకాలు చేస్తున్న 482 పోస్టులలో నియమించాలని జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షుడు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి యు.రాజు డిమాండ్ చేశారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద యూనియన్ ఆధ్వర్యాన రెండు రోజులపాటు చేపట్టే రిలే దీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యుజిడి, వాటర్ సప్లరు విభాగాలలో పనిచేసి మరణించిన వారి, 60 ఏళ్లు నిండిన వారి కుటుంబాల్లో వారికి కూడా ఉద్యోగాలు కల్పించాలన్నారు. జివిఎంసికి జీవితాలను ధారబోసి పనిచేసిన కార్మికుల కుటుంబాలను విస్మరించి కొత్తవారికి ఉపాధి కల్పించడం సరికాదన్నారు. ఇటీవల జివిఎంసిలో 300 మందిని కొత్తగా నియమించారని, వారందరినీ తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు. కార్మికులపై వేధింపులు ఆపాలని కోరారు. దీక్షల్లో యూనియన్ డిప్యూటీ కార్యదర్శి ఎంవి.ప్రసాదరావు, ఉపాధ్యక్షుడు ఎస్.రమణ, కార్యదర్శి జె.నాయుడు, ఎం.ఈశ్వరరావు, ఎస్.గణేష్, రత్నం, సత్యవతి, రాజు తదితరులు పాల్గొన్నారు.










