ప్రజాశక్తి-విఆర్.పురం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి నుండి చిన్నచూపే చూస్తున్నాయి. ప్యాకేజీ, పునరావాసం అమలు విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం, మరణించిన నిర్వాసితుల కుటుంబాల వారసులకు పోలవరం ఫ్యాకేజీ అమలు చేయడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక సర్వేలు నిర్వహించి నిర్వాసితులను గుర్తించగా, చివరి గ్రామసభల సమయానికి పిడిఎఫ్ కుటుంబ యజమానులు కొందరు మరణించారు. ఇలా మరిణించిన వారి వారసులకు ఆ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా, అది అమలుకు నోచకోవడం లేదు. దీంతో మరణించిన వారి వారసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా సర్వం వదులుకొని పునరావాస కాలనీలకు వెళుతున్న నేపథ్యంలో మరణించిన వారి కుటుంబాల వారసులకు ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించి ఆదుకోవాలని సిపిఎం నాయకులు, నిర్వాసితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ముంపు గ్రామాల ప్రజల్లో భయాందోళన
గోదావరి వరదల భయం ముంపు గ్రామాల ప్రజలను ఇంకా వీడలేదు. ఇక్కడి నిర్వాసితులను ఎప్పటిలోగా పునరావాస కాలనీలకు పంపుతారో అంతుపట్టని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కూడా వరదలొస్తే మళ్లీ కొండలు, గుట్టల పాలు కావాల్సిందేనా? అంటూ ఆందోళన చెందుతున్నారు. గిరిజన, గిరిజనేతర నిర్వాసితులకు ఏలూరు జిల్లా తాడ్వాయి ప్రాంతంలో పునరావాస కాలనీలు నిర్మించారు. ఇంకా కొన్ని గ్రామాల వారికి ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. అలాంటిది ఈ ఏడాది జూన్ నాటికి పునరావాస కాలనీలకు ఎలా పంపిస్తారన్న సందిగ్ధత నిర్వాసితులోల నెలకొంది. ఈ ఏడాది కూడా భారీగా వరదలు వస్తే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన చెందుతున్నారు.










