ప్రజాశక్తి - ఏలూరు
జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలకు నిర్ధేశించిన రుణ లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బ్యాంకర్లను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గౌతమి సమావేశపు హాలులో శుక్రవారం జరిగిన బ్యాంకర్ల జిల్లా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా రుణ ప్రణాళికలో రుణ లక్ష్యం రూ.12, వేల 807 కోట్ల రుణ లక్ష్యానికి గాను ప్రాధాన్యతరంగాలకు నిర్ధేశించిన రూ.10,257 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు 2550 కోట్ల రూపాయలు రుణాల మంజూరు లక్ష్యంగా నిర్దేశించారన్నారు. రైతాంగానికి స్వల్పకాలిక వ్యవసాయ రుణాల కింద 5,423 కోట్ల రూపాయలకు గాను, 4,514 కోట్ల రూపాయలు 83 శాతం మేర రుణాల మంజూరు చేశామని, 8,992 మంది కౌలు రైతులకు రూ.52.24 కోట్లు అందించామన్నారు. నూరు శాతం లక్ష్యాలను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని బ్యాంకర్లను కలెక్టర్ కోరారు. స్వల్ప, మధ్యతరహా పరిశ్రమలకు రూ.2050 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.800 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో పేదలకు 87 వేల ఇళ్లను నిర్మిస్తున్నారన్నారు. వీరిలో డ్వాక్రా సభ్యులకు ఇళ్ల నిర్మాణానికి కొత్తగా గ్రూపులో చేరిన సభ్యులకు అదనపు రుణంగా రూ.35 వేలు మంజూరు చేయాలనీ కోరారు. డ్వాక్రా సంఘాలకు రుణాల మంజూరులో ఏడు రకాలైన పలు ఛార్జీలను వసూలు చేస్తున్నారని, వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారంటీ పథకంలో దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేయకుండా బ్యాంకర్లు నిలిపివేసిన దరఖాస్తులపై సహేతుకమైన కారణాలను తెలియజేయాలని, వీటిని జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక మండలి సమావేశంలో సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ జిల్లా ఆక్వా కల్చర్‌కు ఎంతో అనువైన ప్రాంతమని, ఆక్వాకల్చర్ మరింత అభివృద్ధికి ఫిష్ ఆంధ్రా యూనిట్ల ఏర్పాటుకు నిరుద్యోగ యువతకు రుణాలు అందించి జిల్లాలో ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి బ్యాంకర్లు తోడ్పడాలన్నారు.
కార్పొరేట్ సామజిక బాధ్యత కింద బ్యాంకర్లు వారి నికర లాభం నుండి రెండు శాతం నిధులు ప్రజల సామాజిక అవసరాల కోసం ఖర్చు చేయాల్సి ఉందని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు. ఈ సమావేశంలో యూనియన్ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.గోపా లకృష్ణమూర్తి, ఆర్‌బిఐ ప్రతినిధి నాగప్రవీణ్, నాబార్డ్ డిడిఎం టి.అనిల్ కాంత్, జిల్లా పంచాయతీ అధికారి, మత్స్య శాఖ ఇన్‌ఛార్జి జాయింట్ డైరెక్టర్ మల్లికార్జునరావు, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, వ్యవసాయశాఖ జెడి వై.రామకృష్ణ, జిల్లా పరిశ్రమల అధికారి ఏసు దాసు, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ ఎస్‌ఎస్‌ఎ.వెంకటేశ్వరరావు, వివిధ బ్యాంకుల జిల్లా కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.










