Feb 20,2023 23:49

సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌కు సమస్యలు విన్నవిస్తున్న సిపిఎం నేత పృధ్వీరాజ్‌

తూకాలు, ధరల్లో మోసాలపై స్వయంగా పరిశీలన
అక్రమాలపై కఠిన చర్యలకు అధికారులకు ఆదేశం
సిపిఎం, గిరిజన సంఘం నేతల ఫిర్యాదుకు స్పందన
ప్రజాశక్తి- పెదబయలు
: మండల కేంద్రమైన పెదబయలులో సోమవారం జరిగే వారపుసంతను జిల్లా సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్‌తో కలిసి, సంతలోని అన్ని దుకాణాలు, వాటిల్లో సరుకులు, కొనుగోలు కేంద్రాలు, అక్కడున్న కాటాలను స్వయంగా పరిశీలించారు. వ్యాపారులు తూకాలు వేస్తున్న తీరును, గిరిజన ఉత్తత్తులకు చెల్లించే ధరలు ఇతరత్రా అన్ని విషయాలపై సమగ్ర పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము పృధ్వీరాజ్‌, ఇతర నేతలు సంతలో జరుగుతున్న మోసాలు, జరుగుతున్న అక్రమాలను సబ్‌కలెక్టర అభిషేక్‌కు వివరించారు. అమాయక గిరిజనులకు అన్యాయం జరగకుండా, అధికారుల పర్యవేక్షణ, నిఘా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు.
వారపుసంతలో తూకాలు, ధరల్లో మోసాలు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై సిపిఎం, గిరిజన సంఘం నేతలు ఫిర్యాదుతో స్పందించి, వారపుసంత ఆకస్మిక తనిఖీకి వచ్చిన సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌, రాజ్మా, చిక్కుళ్లు పిప్పళ్లమోరీ, పసుపు తదితర గిరిజన ఉత్తత్తుల తూకాల్లోనూ, గిరిజన రైతులకు ధరలు చెల్లింపులో ఎటువంటి అవకతవకలు మోసాలు జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఉద్యానవనశాఖాధికారులను ఆదేశించారు. తూనికల్లో తేడాలుంటే తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాపారులతో మాట్లాడి, గిరిజన ఉత్తత్తుల కొనుగోలు సమయంలో వారికి ఏవిధంగా మోసపుచ్చి, నష్టపరిచినా చట్టపరమైన చర్యలకు బాధ్యులౌతారని హెచ్చరించారు. అలాగే సంతల్లో గిరిజనులకు అమ్మడానికి నాణ్యమైన వస్తువులను తీసుకురావాలని సూచించారు. స్థానిక వైస్‌ ఎంపిపి కె.రాజబాబు ఉన్నారు.
వారపుసంతలో సమస్యలు, మోసాలపై వినతి
పెదబయలు : స్థానిక వారపుసంతలో అక్రమాలు, మోసాలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కొమ్మ పృధ్వీరాజ్‌ కోరారు. సోమవారం వారపుసంత ఆకస్మిక తనిఖీకి వచ్చిన సందర్భంగా సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌కు స్వయంగా సంతలో జరిగే మోసాలను చూపించి, వివరించామన్నారు. ఈ సందర్భంగా గిరిజనులు పండించే వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, వారపుసంతల్లో జిసిసి ధరల పట్టిక ఏర్పాటు చేయాలని, తూకాలు, కొలతలతోపాటు వస్తువుల నాణ్యతలో మోసాలను అరికట్టాలని, సంతలో తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించాలని, మార్కెటింగ్‌ కమిటీ ద్వారా గోదాములను ఏర్పాటు చేయాలని కోరారు. ఇదే సమయంలో మైదానప్రాంతం నుంచి వచ్చే వ్యాపారులు, దళారులు గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటుధర దక్కకుండా మోసాలకు పాల్పడుతున్నారని సబ్‌కలెక్టర్‌కు వివరించామన్నారు. పెదబయలు వారపుసంతలో లక్షల్లో క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, కొర్రాపుట్టు, జల్దర్బుర్‌ వంటి ప్రాంతాల నుంచి టన్నుల్లో కూరగాయలు, ఇతర ప్రాంతాల నుంచి పసుపు, పిప్పలమోరీ, చింతపండు, ఇతర అటవీ దినుసులు, గిరిజన ఉత్పత్తులను సంతకు తీసుకొచ్చి గిరిజనం విక్రయించే సమయంలో మోసాలు జరుగుతున్నాయని వివరించారు. దీనిపై అప్పటికప్పుడు విన్నవిద్దామంటే మార్కెటింగ్‌, జిసిసి అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గిరిజనులు నష్టపోవాల్సి వస్తోందన్నారు. వనబసింగి, దొడిపుట్టు.మకవరం పనసపుట్టు పెడగూడ చినసిందిపుట్టు తదితర గిరిజన పంచాయతీల నుంచి వాణిజ్యదినుసులు అధిక మొత్తంలో గిరిజన రైతులు అమ్మకానికి తెస్తున్నా, వారికి గిట్టుబాటు ధర లభించని పరిస్థితి ఉందని సబ్‌ కలెక్టర్‌కు విన్నవించామన్నారు. సీజన్‌లో గిరిజన ఉత్పత్తుల క్రయవిక్రయాలు భారీ స్థాయిలో జరగనున్న నేపథ్యంలో వారపుసంతలో అధికారులను మోహరించి, ఎటువంటి అక్రమాలు, మోసాలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు.