ప్రజాశక్తి-అనంతగిరి
గిరిజన గ్రామాల్లో సంక్రాంతి శోభని సంతరించుకుంది. గత 10. రోజుల నుండి ఊరు వాడంతా రంగుల ముగ్గులు వేసుకుంటూ జనాలతో సందడి చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో గత నాలుగు రోజులు క్రితమే పండుగను ముగించుకున్నప్పటికీ మండలంలోని పలు గ్రామాల్లో సంక్రాంతి పండుగలను ప్రారంభించుకున్నారు. బుధవారం కొండిబ పంచాయతీ డమకు వారపు సంతలో కుండిబ గ్రామానికి చెందిన గిరిజనులు రంగులను పూసుకుని సంతలో డప్పులు, సన్నాయి వాయిస్తూ దింసా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ప్రతి దుకాణంకు వెళ్లి ఉప్పు, మిరప, కూర కాయలు వంటి వస్తువులను సేకరించుకున్నారు. ఈ కూరకాయలతో చివరి రోజు పండుగని సంతరించుకొని గ్రామస్తులందరూ భోజనాలు ఏర్పాటు చేసుకొని పిల్లా పాపలతో గడుపుతారు.
ముగిసిన సంక్రాంతి సంబరాలు
డుంబ్రిగూడ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండల కేంద్రంలో అల్లూరి యూత్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిసాయి. మూడు రోజులపాటు స్థానిక గ్రామస్తులు, యువతి, యువకులు చిన్నా పెద్ద తేడా లేకుండా గిరిజన సంప్రదాయమైన దింసా నృత్యం ప్రదర్శిస్తూ ఆనందంగా పండుగను జరుపుకున్నారు.










