సంతకు పెద్ద సంఖ్యలో వచ్చిన గిరిజనులు
ప్రజాశక్తి -సీలేరు
జికె.వీధి మండలం దారకొండలో ఆదివారం జరిగిన వారపు సంతలో సంక్రాంతి సందడి కనిపించింది. సంక్రాంతి పండుగ దగ్గర పడడంతో గిరిజనులు కొత్త బట్టలు, తమకు కావాల్సిన సరుకులు, సామగ్రి పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. జీకే వీధి మండలంలోని సీలేరు, దారకొండ, దుప్పులవాడ, గుమ్మిరేవులు పంచాయితీలకు చెందిన గిరిజనులు అధిక సంఖ్యలో సంతకు రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంత గిరిజనులు సంక్రాంతి పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. బంధుమిత్రులను ఆహ్వానించి వారి ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా రకరకాల వంటకాలు తయారు చేసి పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి సహపంక్తి భోజనాలు చేస్తారు. ఈ నేపథ్యంలోనే గిరిజనులు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేశారు.










