ప్రజాశక్తి -అనకాపల్లి
విశాఖపట్నం నుంచి వారణాసికి రైల్వే శాఖ రైలు వేయడంపై అనకాపల్లి ఎంపీ డాక్టర్ బివి.సత్యవతి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిశారు. స్థానిక వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ తో సమావేశ మందిరంలో శనివారం విలేకరుల సమావేశంలో వైసిపి సీనియర్ నాయకులు డాక్టర్ విష్ణు మూర్తితో కలిసి ఆమె మాట్లాడారు. వారణాసికి రైలు వెయ్యాలని పలుమార్లు పార్లమెంటులో తాను ప్రస్తావించడం జరిగిందన్నారు. ఈ ట్రైన్ వారంలో రెండుసార్లు ఆదివారం, బుధవారాల్లో విశాఖపట్నంలో ఉదయం 4.20 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 9.25 గంటలకు వారణాసి చేరుతుందన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పిఎంజిఎస్‌వై పథకంలో భాగంగా 12 రోడ్లుకు ప్రతిపాదనలు చేయగా ఇప్పటికే 11 రోడ్లు వేయడం జరిగిందన్నారు. మాడుగుల రోడ్డు 9.4 కోట్లతో నిర్మించాల్సి ఉందన్నారు. జనవరి నాటికి రోడ్ల పనులు పూర్తి చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎన్టీఆర్ క్రీడమైదానాన్ని కోటి రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ డిఈ వేణుగోపాల్ పాల్గొన్నారు.